అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో.. అంతకుముందే క్వాంటమ్ ఆధారిత సాంకేతికతను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడలోని స్టేట్ డేటా సెంటర్‌లో ‘కొహెరెంట్ ఐసింగ్ మెషీన్’ (సీఐఎం)ను ఏర్పాటు చేయనున్నారు.
సంప్రదాయ కంప్యూటర్లతో పరిష్కరించడానికి ఎక్కువ సమయం పట్టే సంక్లిష్ట ఆప్టిమైజేషన్ సమస్యలను వేగంగా పరిష్కరించగల సామర్థ్యం సీఐఎంకు ఉంది. దీనిని సంప్రదాయ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ మధ్య వారధిగా పనిచేసే హైబ్రిడ్ సాంకేతికతగా పేర్కొంటున్నారు. ఫోటాన్ల సమూహం ఉత్పత్తి చేసే విద్యుత్ క్షేత్రాల ఆధారంగా ఇది పనిచేస్తుంది.
సాధారణ క్వాంటమ్ కంప్యూటర్లకు అత్యల్ప ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. అయితే సీఐఎం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పనిచేయడం దీని ప్రత్యేకత. బెంగళూరుకు చెందిన ‘కాన్‌ఫ్లుయెన్స్’ స్టార్టప్ ఈ సాంకేతికతను రూపొందించింది. అమెరికాకు చెందిన ‘అరోహక్’ సంస్థ సహకారంతో విజయవాడ స్టేట్ డేటా సెంటర్‌లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రం ఏర్పాటుకు సుమారు రూ.2 కోట్ల వ్యయం కానుంది.
సీఐఎంను వివిధ రంగాల్లోని సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. డ్రగ్ డిస్కవరీ, కృత్రిమ మేధ, యంత్ర అభ్యసనం, లాజిస్టిక్స్, సరఫరా గొలుసు నిర్వహణ, ఆర్థిక నమూనాలు, మెటీరియల్ సైన్సెస్, రూట్ ప్లానింగ్ వంటి రంగాల్లో దీని సేవలను వినియోగించవచ్చు.
రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, పరిశోధకులు కూడా ఈ కంప్యూటింగ్ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. అమరావతి క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ (ఏక్యూఐసీ)లో భాగస్వాములైన విద్యాసంస్థలు దీనిని ఉపయోగించుకోగలవు.
అమరావతి క్వాంటమ్ మిషన్ ఆధ్వర్యంలో ఏక్యూఐసీకి చెందిన ప్రొఫెసర్లు ఇప్పటికే సుమారు 100 యూజ్ కేసులకు సంబంధించిన అల్గారిథమ్‌లపై పనిచేస్తున్నారు. సీఐఎం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయా అల్గారిథమ్‌లను నేరుగా దానిపై పరీక్షించి, వాటి పనితీరును పరిశీలించే అవకాశం ఉంటుంది.
క్వాంటమ్ సాంకేతికతను ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా చేయడంలో భాగంగా 108 అంబులెన్స్ సేవలపై ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత గుంటూరు జిల్లాలోని 67 అంబులెన్స్‌లతో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. నాలుగు స్టార్టప్ సంస్థలు దీనిపై పనిచేస్తున్నాయి.
ప్రస్తుతం అంబులెన్స్‌లను ప్రధానంగా జిల్లా, మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. అత్యవసర ఫోన్ కాల్ వచ్చిన తర్వాత సంబంధిత అంబులెన్స్ అక్కడికి చేరుకుంటోంది. కొత్త విధానంలో మాత్రం గత మూడేళ్ల అత్యవసర కాల్స్ సమాచారాన్ని విశ్లేషించి.. ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయో ముందుగానే గుర్తిస్తారు.
ఆ ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా అంబులెన్స్‌లను ముందుగానే మోహరించేలా అల్గారిథమ్‌ను రూపొందించనున్నారు. దీంతో అత్యవసర కాల్ వచ్చిన వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకునే సమయం తగ్గే అవకాశం ఉంటుంది.
అంబులెన్స్ బయలుదేరిన తర్వాత కూడా ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు సాంకేతికతను ఉపయోగించనున్నారు. సమీపంలోని ఏ ఆసుపత్రికి ఏ మార్గంలో వేగంగా చేరుకోవచ్చో డ్రైవర్‌కు సూచనలు అందేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. మార్గమధ్యంలో ట్రాఫిక్ పరిస్థితులను తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానం చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
దీంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను మరింత వేగంగా, సమర్థంగా అందించే అవకాశం ఉంటుంది. అంబులెన్స్‌లకు సంబంధించిన ప్రాజెక్టుతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన మరో 24 యూజ్ కేసులను కూడా గుర్తించినట్లు అమరావతి క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తెలిపారు. ఆయా యూజ్ కేసులకు సంబంధించిన అప్లికేషన్లను రన్ చేసేందుకు సీఐఎం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















