భారత్-బ్రెజిల్ మధ్య అక్టోబర్‌లో జరగనున్న స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌పై భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు భైఛుంగ్ భూటియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌ను అభిమానులు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. భారీ మొత్తంలో ప్రజాధనం లేదా ఇతర నిధులను ఖర్చు చేసి బ్రెజిల్ జట్టును భారత్‌కు తీసుకురావడం కంటే.. ఆ మొత్తాన్ని దేశంలో క్రీడల అభివృద్ధికి వినియోగించడం మంచిదని అభిప్రాయపడ్డారు.
అక్టోబర్‌లో కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో భారత్-బ్రెజిల్ స్నేహపూర్వక మ్యాచ్ నిర్వహించేందుకు పశ్చిమ్ బెంగాల్ ఫుట్‌బాల్ సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఐదుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన బ్రెజిల్ జట్టు భారత్‌లో ఆడనుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ మ్యాచ్ నిర్వహణకు సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో భైఛుంగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
“బ్రెజిల్ మ్యాచ్‌ను బహిష్కరించండి. ప్రతి నిర్వాహకుడు, ప్రతి ఫెడరేషన్ ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఈ మ్యాచ్ కోసం బెంగాల్ ప్రభుత్వం నిధులు ఇస్తుందా? లేక నిధుల సమీకరణ ద్వారా నిర్వహిస్తారా? అనేది స్పష్టంగా తెలియాలి” అని భైఛుంగ్ పేర్కొన్నారు.
మ్యాచ్ నిర్వహణకు ఖర్చు చేసే మొత్తాన్ని ఇతర క్రీడలకు మళ్లిస్తే దేశానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సౌకర్యాలు కల్పించేందుకు నిధులను వినియోగించవచ్చని సూచించారు.
“మన దగ్గర రూ.30 కోట్లు ఉంటే.. 2030 కామన్వెల్త్ క్రీడల కోసం ఖర్చు చేయాలి. భారత్‌కు ఒలింపిక్స్‌ను తీసుకురావాలని అనుకుంటున్నాం. బెంగాల్ నుంచి మరింతమంది ఒలింపియన్లను తయారు చేసేందుకు ఆ మొత్తాన్ని వినియోగించాలి” అని భైఛుంగ్ అన్నారు.
దేశంలో ఫుట్‌బాల్ క్రీడను క్షేత్రస్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, యువ ఆటగాళ్లకు శిక్షణ, అకాడమీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తే దీర్ఘకాలంలో భారత ఫుట్‌బాల్‌కు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
అయితే బ్రెజిల్ జట్టు ఎలాంటి భారీ వ్యయం లేకుండా భారత్‌కు వచ్చి ఆడితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని భైఛుంగ్ స్పష్టం చేశారు. “బ్రెజిల్ ఇక్కడికి ఉచితంగా వచ్చి ఆడితే నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ మనమే భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ డబ్బును దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఫుట్‌బాల్ అభివృద్ధికి వినియోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















