సోషల్ మీడియా వేదికగా మంచి రీచ్, ఫాలోయింగ్ ఉన్న కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తూ రూపొందించిన వీడియోలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా రూ.1 లక్ష వరకు నగదు చెల్లించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సోషల్ మీడియా పాలసీలో చేసిన సవరణలకు బీహార్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కొత్త విధానం ప్రకారం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందితే.. దాని వ్యూస్ ఆధారంగా క్రియేటర్లకు చెల్లింపులు చేయనున్నారు. కనీసం 1 లక్ష వ్యూస్ సాధించిన కంటెంట్‌కు రూ.10,000 వరకు అందించే అవకాశం ఉంది. అదే కంటెంట్ 10 లక్షల వ్యూస్‌ను సాధిస్తే గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు చెల్లించనున్నారు.
అయితే 10 లక్షలకు మించి వ్యూస్ వచ్చినా ఈ పాలసీ కింద చెల్లించే మొత్తం రూ.1 లక్షకే పరిమితం కానుంది. అంటే 20 లక్షలు, 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వ్యూస్ వచ్చినా గరిష్ఠంగా రూ.1 లక్ష మాత్రమే అందుతుంది.
అనుమతి తీసుకోవడం తప్పనిసరి :
అన్ని వీడియోలకు ఈ ప్రయోజనం వర్తించదు. బీహార్ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన కంటెంట్‌కు మాత్రమే చెల్లింపులు చేస్తారు. కంటెంట్ నాణ్యత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, వీడియోకు వచ్చిన వ్యూస్ వంటి అంశాలను అధికారులు పరిశీలించిన తర్వాతే చెల్లింపులపై నిర్ణయం తీసుకుంటారు.
ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సమాచార, ప్రజా సంబంధాల విభాగం (IPRD)లో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. IPRD నుంచి అనుమతి పొందకుండా రూపొందించిన వీడియోలను ప్రభుత్వం ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకోదు.
ఫాలోవర్లపైనా నిఘా :
క్రియేటర్లకు చెల్లింపులు చేసే ముందు వారి సోషల్ మీడియా ఖాతాలు, ఛానెళ్లను అధికారులు ధ్రువీకరించనున్నారు. సంబంధిత ఖాతాల్లో ఉన్న ఫాలోవర్లు, వీడియోలకు వచ్చిన వ్యూస్, కంటెంట్ నాణ్యత వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ వివరాలను నిరంతరం తనిఖీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా ప్రభావాన్ని ఉపయోగించుకోవడంతో పాటు.. స్థానిక కంటెంట్ క్రియేటర్లను ప్రభుత్వ ప్రచారంలో భాగస్వామ్యం చేయడమే ఈ కొత్త విధానం లక్ష్యంగా కనిపిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















