విద్యుత్ వినియోగాన్ని కొలిచే మీటర్ల రూపం, పనితీరు కాలానుగుణంగా ఎంతగా మారిందో తెలియజేసేలా ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద టీజీఎస్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో శనివారం నుంచి నిర్వహించనున్న పవర్ ఎగ్జిబిషన్‌లో దాదాపు యాభై రకాల విద్యుత్ మీటర్లను ప్రదర్శనకు సిద్ధం చేశారు.
ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా 120 ఏళ్ల నాటి ఎలక్ట్రోమెకానికల్ (అనలాగ్) విద్యుత్ మీటరు నిలవనుంది. ఇంగ్లాండ్‌లోని హాలిన్‌వుడ్, ల్యాంకషైర్‌లో ఫెరంటీ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ఈ మీటర్లను ఆంగ్లేయుల పాలనలో భారతదేశానికి దిగుమతి చేసుకుని వినియోగించినట్లు అధికారులు తెలిపారు.
నాటి అనలాగ్ మీటరులో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా అల్యూమినియం డిస్క్ వేగంగా తిరుగుతూ ఉండేది. డిస్క్ తిరిగే సమయంలో వచ్చే కిర్రుకిర్రుమనే శబ్దం అప్పటి విద్యుత్ మీటర్లకు ప్రత్యేక గుర్తింపుగా ఉండేది. వినియోగం పెరిగితే డిస్క్ తిరిగే వేగం కూడా పెరిగేది.
కాలక్రమంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఎలక్ట్రోమెకానికల్ మీటర్ల స్థానంలో తేలికైన డిజిటల్ స్టేటిక్ మీటర్లు అందుబాటులోకి వచ్చాయి. మైక్రోకంట్రోలర్ ఆధారిత ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌తో పనిచేసే ఈ మీటర్లలో కదిలే భాగాలు లేకపోవడంతో శబ్దం లేకుండా పనిచేస్తాయి. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై విద్యుత్ వినియోగ రీడింగ్ స్పష్టంగా కనిపిస్తుంది.
విద్యుత్ మీటర్ల పరిణామాన్ని ఒకేచోట చూపించేలా పాత అనలాగ్ మీటర్ల నుంచి ఆధునిక డిజిటల్ మీటర్ల వరకు వివిధ నమూనాలను ప్రదర్శనలో ఉంచనున్నారు. భవిష్యత్తులో వినియోగంలోకి రానున్న స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లపై కూడా సందర్శకులకు అవగాహన కల్పించనున్నారు.
విద్యుత్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎలా మారుతూ వచ్చిందో ప్రజలకు వివరించడంతో పాటు, పాతతరం విద్యుత్ మీటర్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించడమే ఈ ప్రదర్శన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















