రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శౌచాలయాల కొరత విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని పాఠశాలల్లో అవసరమైనన్ని శౌచాలయాలు లేకపోగా, మరికొన్ని చోట్ల ఉన్నవాటికి సరైన నిర్వహణ లేకపోవడం, తలుపులు లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ముఖ్యంగా బాలికలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 15 శాతం పాఠశాలల్లో విద్యార్థులు తమ అవసరాలు తీర్చుకునేందుకు తగిన శౌచాలయ సదుపాయాలు లేవని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శౌచాలయాలకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడం, మరికొన్ని చోట్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలురు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అనేక పాఠశాలల్లో ఈ ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 వేల పాఠశాలలు ఉండగా, వాటిలో దాదాపు 12 వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30 లోపే ఉంది. మరోవైపు, 2025 డిసెంబరు నాటికి 1,823 బాలికల శౌచాలయాల నిర్మాణానికి అనుమతులు మంజూరు కాగా, 851 పూర్తయ్యాయి. 342 నిర్మాణాలు పురోగతిలో ఉండగా, 630 పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
అవసరమైన చోట కొత్త శౌచాలయాలను నిర్మించడంతోపాటు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను ఈ విద్యాసంవత్సరంలోనే పూర్తి చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు అవసరమైన నిధుల విషయంలో కేంద్రం నుంచి కూడా ఆమోదం లభించిందని వెల్లడించారు.
మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ఈదులపూసపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 211 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, తగిన శౌచాలయ సదుపాయాలు లేవు. బాలికలకు ఉన్న రెండు శౌచాలయాలు కూడా శిథిలావస్థకు చేరుకోగా, బాలురకు సరైన సదుపాయం లేక ఆరుబయటే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన కొన్ని నిర్మాణాలు కూడా బిల్లులు మంజూరు కాకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















