రాష్ట్రంలో పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
ఈ పరిస్థితులు జూన్ 6వ తేదీ వరకు కొనసాగవచ్చని ఐఎండీ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉంచిన ధాన్యం, రవాణా వాహనాల్లో ఉన్న పంట కూడా వానపాలై రైతులు భారీ నష్టాలను చవిచూశారు. ఆకస్మికంగా కురిసే వర్షాలతో పంట దిగుబడులు కొట్టుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో గరిష్ఠంగా 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళ, బుధ, గురువారాల్లోనూ ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా గ్రామీణ మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 29 జిల్లాల్లో 40.1 నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జోగులాంబ గద్వాల, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో 39.6 నుంచి 39.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు జిల్లా వాజేడు, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో వడగాలులు ప్రభావం చూపాయి.
ఈ ఏడాది వేసవి గత ఐదేళ్లలో అత్యంత తీవ్రంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలుమార్లు 46.5 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వారానికి పైగా 45 డిగ్రీలకుపైగా ఎండలు కొనసాగాయి.
వానాకాలం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ, రుతుపవనాలు రాష్ట్రాన్ని పూర్తిగా తాకేందుకు మరో పది రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. జూన్ 6 తర్వాత వాతావరణం కొంత చల్లబడే అవకాశముందని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















