చదువులో మంచి ప్రతిభ ఉన్నా.. ఇంటర్వ్యూ లేదా వైవా సమయంలో తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పలేక చాలామంది ఇబ్బందిపడుతుంటారు. పరీక్షల్లో సమాధానాలు రాసేటప్పుడు ఆలోచించుకునే సమయం ఉంటుంది. తప్పులు జరిగితే సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇంటర్వ్యూలో మాత్రం ఎదుటివారు అడిగిన ప్రశ్నకు తక్కువ సమయంలోనే స్పష్టంగా స్పందించాలి. ఈ ఒత్తిడి కారణంగా తెలిసిన సమాధానం కూడా చెప్పలేకపోవచ్చు.
ఉద్యోగం రావడం మాత్రమే కాదు.. ఉద్యోగంలో పదోన్నతి, కొత్త బాధ్యతలు చేపట్టడం వంటి విషయాల్లోనూ సంభాషణా నైపుణ్యం కీలకంగా మారుతోంది. అందుకే చదువుతో పాటు భావాలను స్పష్టంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి.
సమాధానానికి ఒక క్రమం ఉండాలి : ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగిన వెంటనే తొందరపడి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రెండు సెకన్లు ఆలోచించి.. చెప్పాల్సిన విషయాన్ని మనసులో క్రమబద్ధీకరించుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడాలి.
మీ సమాధానాలను పాయింట్ – కారణం – ఉదాహరణ – ఫలితం అనే క్రమంలో చెప్పడం అలవాటు చేసుకోవచ్చు. దీంతో సమాధానం సూటిగా ఉండటంతో పాటు, మీ ఆలోచనా విధానం కూడా ఇంటర్వ్యూ చేసే వారికి అర్థమవుతుంది.
రెండు సెకన్ల విరామం ఇవ్వండి : ప్రశ్న వినగానే వెంటనే మాట్లాడటం వల్ల కొన్నిసార్లు సమాధానం గందరగోళంగా మారుతుంది. అందుకే ప్రశ్న పూర్తయ్యాక కొద్దిసేపు ఆలోచించి స్పందించడం మంచిది. సమాధానాన్ని చిన్న చిన్న వాక్యాలుగా చెప్పాలి. ముఖ్యమైన అంశాల మధ్య కొద్దిగా విరామం ఇవ్వడం వల్ల మాటల్లో స్పష్టత పెరుగుతుంది. ‘నేను తప్పు చెబితే ఏమనుకుంటారు?’ అనే భయాన్ని కూడా తగ్గించుకోవాలి. పరిపూర్ణమైన సమాధానం చెప్పాలనే ఒత్తిడి కంటే.. తెలిసిన విషయాన్ని సహజంగా వివరించడంపై దృష్టి పెట్టాలి.
పుస్తక జ్ఞానంతో పాటు విశ్లేషణ ముఖ్యం : ఇంటర్వ్యూలో కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలను గుర్తుపెట్టుకోవడం సరిపోదు. ఒక అంశాన్ని చదివేటప్పుడు ‘ఎందుకు?’, ‘ఏమిటి?’, ‘ఎలా?’ అనే ప్రశ్నలు వేసుకుంటూ విశ్లేషించుకోవాలి.స్నేహితులతో చర్చించడం, ఒక అంశంపై మీ అభిప్రాయాన్ని వారితో పంచుకోవడం కూడా మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇలా సాధన చేస్తే ప్రశ్నను ఏ విధంగా అడిగినా మీకు తెలిసిన విషయాన్ని మీ మాటల్లో వివరించే నైపుణ్యం పెరుగుతుంది.
ఉదాహరణతో సమాధానం మరింత బలంగా.. : ‘మీ బలాలేంటి?’ అని అడిగినప్పుడు ‘కష్టపడి పనిచేస్తాను, ఒకేసారి అనేక పనులు చేయగలను’ అని చెప్పడంతో ఆపేయకూడదు. గతంలో అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు? మీ బాధ్యత ఏమిటి? సమస్యను ఎలా పరిష్కరించారు? చివరకు ఎలాంటి ఫలితం వచ్చింది? అనే అంశాలను క్లుప్తంగా వివరించాలి.అయితే సమాధానాన్ని బట్టీ పట్టినట్లు పెద్ద పేరాలుగా చెప్పకూడదు. ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకుని సహజంగా వివరించడం ఉత్తమం. సాధ్యమైనంత వరకు మీ అనుభవానికి సంబంధించిన ఉదాహరణను జోడిస్తే సమాధానం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
సమాధానం తెలియకపోయినా మౌనంగా ఉండొద్దు : ఏదైనా ప్రశ్నకు సమాధానం వెంటనే గుర్తుకు రాకపోతే పూర్తిగా మౌనంగా ఉండిపోవద్దు. కొద్దిసేపు ఆలోచించి మీకు తెలిసిన విషయాన్ని వివరించండి. పూర్తి సమాధానం తెలియకపోయినా మీ ఆలోచనా విధానాన్ని చెప్పడం ద్వారా మీ విశ్లేషణ సామర్థ్యాన్ని చూపించవచ్చు.తెలియని విషయాన్ని తప్పుగా చెప్పడం కంటే.. ‘ఈ అంశంపై నాకు పూర్తి అవగాహన లేదు’ అని నిజాయతీగా చెప్పడం కూడా మంచిదే.
రోజుకు పది నిమిషాల సాధన :
మాట్లాడే నైపుణ్యం ఒక్కరోజులో రాదు. నిరంతర సాధనతోనే మెరుగుపడుతుంది. ఇందుకోసం రోజుకు పది నిమిషాల సాధన చేయొచ్చు. మొదటి రెండు నిమిషాలు ఏదైనా అంశాన్ని గట్టిగా చదవాలి. తర్వాత మూడు నిమిషాలు అదే అంశంపై మీకు మీరే ప్రశ్న వేసుకుని సమాధానం ఆలోచించాలి. మరో మూడు నిమిషాలు ఆ సమాధానాన్ని ఫోన్‌లో రికార్డు చేసుకోవాలి. చివరి రెండు నిమిషాలు ఆ రికార్డింగ్‌ను విని ఎక్కడ తడబడ్డారు, ఎక్కడ ఎక్కువగా ఆగారు, ఏ అంశాన్ని మరింత స్పష్టంగా చెప్పాల్సి ఉందో విశ్లేషించుకోవాలి.అద్దం ముందు మాట్లాడే సాధన చేసినా హావభావాలు, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే వేగంపై అవగాహన పెరుగుతుంది.
మార్కులు మీ జ్ఞానాన్ని చూపిస్తాయి. కానీ ఇంటర్వ్యూలో మీ సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, సంభాషణా నైపుణ్యాలే మీ ప్రతిభను ఎదుటివారికి చేరవేస్తాయి. కాబట్టి రాయడంలోనే కాదు.. చెప్పడంలోనూ మెరుగ్గా ఉండేలా ప్రతిరోజూ సాధన చేయండి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















