కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్‌ఖాన్ దిల్లీలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. నిందితుడి ఆచూకీ కోసం గత ఐదు రోజులుగా పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. పది మంది ఎస్సైలు సహా సుమారు 40 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
శుక్రవారం పక్కా సమాచారంతో దిల్లీలో చేపట్టిన తనిఖీల్లో సాధిక్‌ఖాన్ పట్టుబడినట్లు సమాచారం. అతడిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆదివారానికల్లా సాధిక్‌ను కాకినాడకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటన, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతి వెనుక సాధిక్‌ఖాన్ పాత్రపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. నూకరాజు కుమార్తె సౌజన్యతో సాధిక్ సన్నిహితంగా ఉంటూ ఆమె వ్యక్తిగత విషయాలు, ఫొటోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల కారణంగానే కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ఈ నెల 16న అర్ధరాత్రి నూకరాజు కుటుంబ సభ్యులు గోదావరి నదిలో దూకిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు ముందు నూకరాజు రాసిన లేఖను వాట్సప్ ద్వారా పలువురికి పంపినట్లు సమాచారం. అందులో కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులు, వేధింపుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
మరోవైపు సౌజన్య పేరుతో లభించిన మరో లేఖ కూడా దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. తన భర్త జగదీశ్వరరెడ్డికి విషం ఇచ్చి సాధిక్ చంపేశాడని, తనను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
లేఖలు, ఇతర ఆధారాల ఆధారంగా రాజమహేంద్రవరం రెండో పట్టణ, కాకినాడలోని సర్పవరం పోలీస్‌స్టేషన్లలో సాధిక్‌ఖాన్‌పై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు పోలీసులకు చిక్కినట్లు వస్తున్న సమాచారంతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. సాధిక్‌ను విచారించిన అనంతరం ఘటనకు దారితీసిన పరిస్థితులు, కుటుంబంపై జరిగినట్లు ఆరోపిస్తున్న వేధింపులు, జగదీశ్వరరెడ్డి మృతి తదితర అంశాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















