అర్హులైన ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అధికారులు సమీక్షలో మాట్లాడుతూ తల్లుల ఆధార్ పరిశీలన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, జులై మూడో వారంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.
ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో ఈ నెల 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జులై మూడో వారంలో తల్లిదండ్రులు–టీచర్ల సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. అలాగే ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్ సహా 12 రకాల ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్ణీత సమయానికి జరగాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ముందుగానే తేదీలు ఖరారు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపుపై కూడా పరిశీలించాలని సూచించారు.
రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు తెలిపారు. థాపర్ ఇన్‌స్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్‌బోర్న్ యూనివర్సిటీ, మేధావి స్కిల్ యూనివర్సిటీ, జేఎస్‌ఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలు రాష్ట్రంలో విద్యాసంస్థలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయని వెల్లడించారు.
జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం మంజూరు చేసిన ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలల్లో మెకానికల్, సివిల్ విభాగాల సీట్లకు డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయని వారు వివరించారు.
ఈ సమీక్షలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్‌గుప్తా, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















