ఏర్పేడు సమీపంలోని ప్రసిద్ధి చెందిన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో దశాబ్దాల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన శివాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయం క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో నిర్మితమైందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆలయంలోని ఏకశిల్పంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరిన శిల్పకళ ప్రత్యేకతగా నిలుస్తోంది.
చరిత్రపరంగా ఈ ఆలయాన్ని పల్లవ, చోళ, విజయనగర రాజులు అభివృద్ధి చేసినట్లు శిలాశాసనాలు వెల్లడిస్తున్నాయి. అయితే గతంలో మహాకుంభాభిషేకం జరిగినప్పటి నుంచి శతాబ్దాలుగా పెద్దగా ధార్మిక క్రతువులు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో మహాకుంభాభిషేకం నిర్వహణకు మార్గం సుగమమైంది.
పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయాన్ని చారిత్రక ప్రాముఖ్యత దెబ్బతినకుండా జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. చాలా కాలంగా అభివృద్ధి పనులు జరగకపోవడంతో ఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు కారడం, గోడలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. గోపురాలు కూడా క్రమంగా కళాహీనంగా మారాయి. ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.25 లక్షలతో పైకప్పు మరమ్మతులు చేపట్టారు. పూర్వకాలంలో ఉపయోగించినట్లే కరక్కాయ, సున్నం, బెల్లం మిశ్రమంతో సంప్రదాయ పద్ధతుల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించడంతో ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహణకు మార్గం సుగమమైంది. ఏప్రిల్ 19 నుంచి 23 వరకు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దక్షిణాది పీఠాధిపతులు ముహూర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న స్వామి, అమ్మవార్లకు బాలాలయం ఏర్పాటు చేసి గర్భగుడిలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ కార్యక్రమం నిర్వహణకు దేవాదాయ శాఖ నుంచి రూ.30 లక్షలు కేటాయించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా భక్తులు, దాతల నుంచి సుమారు రూ.కోటి వరకు విరాళాలు సేకరించి మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని పాలకవర్గం సంకల్పించింది. స్థానికులు కూడా ఈ కార్యక్రమంతో ఆలయానికి మళ్లీ మహర్దశ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















