రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన ఘటనలో తల్లి, కుమార్తె మృతి చెందగా.. కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చెట్టు కొమ్మను పట్టుకుని సుమారు 30 నిమిషాల పాటు వేలాడుతూ బాలుడు ప్రాణాలు కాపాడుకున్నాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగం గ్రామానికి చెందిన ఊరిబాటి సుధాకర్ తన భార్య వసంత (35), కుమార్తె నవ్య (15), కుమారుడు వేణుతో కలిసి 12 ఏళ్ల క్రితం కొత్తపల్లికి వలస వచ్చారు. గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
గత కొంతకాలంగా సుధాకర్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. గురువారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన సుధాకర్.. భార్యతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత పిల్లలను వెంట తీసుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
భార్య, పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో సుధాకర్ వారిని వెతుకుతూ పొలాల వైపు వెళ్లాడు. బావి వద్దకు చేరుకుని కేకలు వేయగా.. బావిలో ఉన్న కుమారుడు వేణు తండ్రి పిలుపు విని స్పందించాడు. చెట్టు కొమ్మను పట్టుకుని ఉన్న వేణును సుధాకర్ బయటకు తీశాడు. అయితే అప్పటికే వసంత, నవ్య నీటిలో మునిగి మృతి చెందారు.
సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా.. సుధాకర్ మద్యం అలవాటుపై గతంలోనూ భార్య, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మద్యం తాగేందుకు వెళ్తున్న సమయంలో అడ్డుకోగా.. భార్యపై దాడికి ప్రయత్నించాడని, ఆమెను బావిలోకి తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారని సమాచారం.
ఈ ఘటనతో కొత్తపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి, కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలుడు ప్రాణాలతో బయటపడటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















