పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ హిందూ ఆలయం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. మదరసా విస్తరణ కోసం ఆలయాన్ని కూల్చివేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తగా.. భారీ వర్షాల కారణంగానే ఆలయం కూలిపోయిందని పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఈ పురాతన ఆలయం ఉన్నట్లు సమాచారం. దాదాపు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి సుమారు 100 నుంచి 125 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయం పక్కనే ఓ మదరసా ఉంది.
నిషేధిత ఇస్లామిక్ పార్టీ తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ (టీఎల్‌పీ)కి చెందిన కొందరు వ్యక్తులు మదరసా విస్తరణ కోసం ఆగస్టు 21న ఆలయాన్ని కూల్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆలయ శిఖరానికి సంబంధించిన మెటల్ ఫిట్టింగులు, ఇటుకలను కూడా అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం.
ఈ ఘటనపై హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆలయం ఉన్న ప్రాంతంలోనే దానిని తిరిగి నిర్మించాలని స్థానిక నాయకులు, మైనారిటీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
అయితే ఆలయ కూల్చివేతపై పాకిస్థాన్ ప్రభుత్వ వాదన భిన్నంగా ఉంది. 100 నుంచి 125 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన నిర్మాణం భారీ వర్షాల కారణంగా కూలిపోయిందని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు అధికారి తెలిపారు.
ప్రభుత్వ రికార్డుల్లో ఈ ఆలయానికి సంబంధించిన పేరు లేదని, ఆలయం ఉన్న భూమిని ఎవరికీ లీజుకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఆలయాన్ని తిరిగి నిర్మించే బాధ్యతను తమ అధికారులు తీసుకుంటారని తెలిపారు.
ఒకవైపు మదరసా విస్తరణ కోసం ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారనే ఆరోపణలు, మరోవైపు ప్రకృతి కారణంగానే నిర్మాణం కూలిపోయిందన్న ప్రభుత్వ వాదన నేపథ్యంలో ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది. దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని హక్కుల కార్యకర్తలు, మైనారిటీ సంఘాలు కోరుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















