రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) నివేదికపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పీఆర్‌సీ నివేదికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రెండో పీఆర్‌సీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఉద్యోగుల ఐకాస ఇచ్చిన ‘చలో హైదరాబాద్’ పిలుపు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ చర్చలు జరిపారు.
బుధవారం సీఎస్‌తో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏల్లో కనీసం మూడు డీఏలను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని, ప్రస్తుతం సుమారు రూ.11 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తమ డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇస్తేనే ఆందోళనను వాయిదా వేస్తామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పీఆర్‌సీ నివేదికను త్వరగా పూర్తిచేసి సమర్పించాలని ఛైర్మన్ శివశంకర్‌కు పంపిన లేఖను సీఎస్ ఉద్యోగ సంఘాల నేతలకు చూపించారు. అనంతరం మిగిలిన డిమాండ్లపైనా ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. సాధారణ పరిపాలనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా పేరిట విడుదలైన ప్రకటనలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)కు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు పీఆర్‌సీ నిపుణులు, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే పెండింగ్ డీఏలు, ఇతర బిల్లులపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ నెల 18న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం శాసనసభ, శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించి ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపింది.
ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగుల ఐకాస ప్రకటించింది. హైకోర్టును ఆశ్రయించి కార్యక్రమానికి అనుమతి పొందామని, అయితే ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీలు ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆందోళనను నిలిపివేస్తున్నామని ఐకాస నేతలు తెలిపారు.
ఈ నెల 18న జరిగే సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత వస్తుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. అనంతరం 19న ఐకాస విస్తృత సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. పీఆర్‌సీ నివేదికను దసరా నుంచి అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















