తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ మార్పుల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా దిల్లీకి చేరుకోవడంతో కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు దిల్లీలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు కూడా బుధవారం దిల్లీ వెళ్లనున్నారు.
వేర్వేరు అధికారిక కార్యక్రమాల కోసం నేతలు దిల్లీకి వెళ్లినప్పటికీ, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వారి పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా మంగళవారం తెల్లవారుజామున దిల్లీ చేరుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనతో సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
మంత్రివర్గంలో మార్పులు, పార్టీ క్రమశిక్షణ అంశాలు, ఇటీవల వివాదాలకు దారితీసిన పరిణామాలు, భవిష్యత్తులో కేబినెట్‌లోకి తీసుకోవాల్సిన నేతలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోనూ కేసీ వేణుగోపాల్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు సంబంధించి కొందరు నేతలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. అయితే చర్యకు ముందు సురేఖ వాదనను అధిష్ఠానం స్వయంగా వినే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇద్దరిపై చర్యలకే పరిమితం అవుతారా? లేక ఈ పరిణామాలను కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు అవకాశంగా తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులతో పాటు, ఒకవేళ సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆమె స్థానాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో మూడు స్థానాలకు కొత్తగా అవకాశం కల్పిస్తారా? లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేస్తారా? అనే చర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది.
ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, సభలు పూర్తయిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొండా సురేఖ స్థానాన్ని భర్తీ చేయాల్సి వస్తే అదే సామాజిక వర్గానికి చెందిన విప్ ఆది శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్నారెడ్డి స్థానంలో బీసీ వర్గానికి అవకాశం కల్పించే అంశంపైనా చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా మంత్రివర్గంలో చోటు కోరుకుంటున్నారనే ప్రచారం ఉంది.
ఖాళీగా ఉన్న మరో స్థానానికి లంబాడా వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రామచంద్రునాయక్, బాలూనాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. మరో స్థానానికి సుదర్శన్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి పేర్లు చర్చలో ఉన్నాయి.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు కూడా చాలాకాలంగా వినిపిస్తున్నప్పటికీ, కోమటిరెడ్డి సోదరులిద్దరికీ కేబినెట్‌లో అవకాశం కల్పించే విషయంలో అధిష్ఠానం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూడా మంత్రివర్గంలో చోటు కోరుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనకు కేబినెట్‌లో అవకాశం లభిస్తే ప్రస్తుత మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు స్పీకర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
అయితే ఇవన్నీ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, ప్రచారాలే. తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య జరిగే సంప్రదింపుల తర్వాతే వెలువడే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















