తెలంగాణ క్రీడారంగ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(కేఎన్‌ఎస్‌యూ)తో ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన కార్యక్రమంలో కేఎన్‌ఎస్‌యూ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ బృందం ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఈ భాగస్వామ్యంతో తెలంగాణకు ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ పద్ధతులు, క్రీడా ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దే విధానాల్లో సహకారం లభించనుంది. అకడమిక్ కార్యక్రమాలు, పాఠ్య ప్రణాళికల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు వంటి అంశాల్లో రెండు విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేయనున్నాయి.
ఈ ఒప్పందం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో దీనిని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, క్రీడా నిపుణుల పరస్పర మార్పిడికి వీలు కల్పించనున్నారు. క్రీడా శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు, పరిశోధనా పత్రాల ప్రచురణలోనూ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024 ఆగస్టులో దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా కేఎన్‌ఎస్‌యూను సందర్శించారు. పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా సాధించిన పతకాలలో కేఎన్‌ఎస్‌యూలో శిక్షణ పొందిన క్రీడాకారుల పాత్రను గుర్తించిన సీఎం.. తెలంగాణ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వామిగా ఉండాలని అప్పట్లో ఆహ్వానించారు.
స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్‌తోపాటు 12 రకాల క్రీడా అకాడమీల ఏర్పాటుపైనా చర్చలు జరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందంతో ఆ చర్చలు కార్యరూపం దాల్చాయి.
ఈ ఒప్పందంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల నుంచి ఒలింపిక్స్ వేదిక దిశగా క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని దేశానికి గర్వకారణంగా నిలిచే అథ్లెట్లను తీర్చిదిద్దుతామని తెలిపారు.
కేఎన్‌ఎస్‌యూతో ఒప్పందం తెలంగాణ క్రీడారంగానికి మైలురాయిగా నిలుస్తుందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలకు తెలంగాణ క్రీడాకారులను మరింత చేరువ చేసేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















