అనగనగా ఒక అడవిలో బలమైన కొమ్ములు కలిగిన ఒక గొర్రెపోతు ఉండేది. తన బలంపై దానికి అమితమైన గర్వం. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనని భావిస్తూ, అడవిలోని చిన్న జంతువులను బెదిరించడం, పొడవడం, వేధించడం దాని అలవాటుగా మారింది. దాంతో అడవిలోని జంతువులన్నీ దానిని చూసి భయపడేవి.
ఈ విషయం గమనించిన ఒక తెలివైన నక్క, గొర్రెపోతుకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఒకరోజు అది గొర్రెపోతు దగ్గరకు వెళ్లి, “నీవు చిన్న జంతువులను ఓడించడం గొప్ప కాదు. నిజంగా నీ బలం ఎంతుందో నిరూపించాలంటే నీకు తగిన ప్రత్యర్థిని ఎదుర్కోవాలి” అని చెప్పింది.
అది విన్న గొర్రెపోతు ఆసక్తిగా, “అయితే నా ప్రత్యర్థి ఎవరు?” అని అడిగింది.
నక్క దూరంగా కనిపిస్తున్న ఒక పెద్ద కొండను చూపిస్తూ, “అదిగో ఆ కొండను చూడు. దాన్ని ఓడిస్తే ఈ అడవిలో నిన్ను మించిన బలవంతుడు ఎవరూ లేరని అందరూ ఒప్పుకుంటారు” అంది.
పొగరుతో నిండిన గొర్రెపోతు వెంటనే కొండ దగ్గరకు వెళ్లి తన కొమ్ములతో దాన్ని ఢీకొట్టింది. కొండపై నుంచి కొంత మట్టి, ఇసుక కింద పడింది. దాంతో తాను కొండను కదిలించానని భావించి మరింత గర్వపడింది.
“ఇంకోసారి బలంగా కొడితే ఈ కొండ నేలమట్టమైపోతుంది” అనుకుని కొంత దూరం వెనక్కి వెళ్లి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి తన శక్తినంతా ఉపయోగించి కొండను ఢీకొట్టింది.
అయితే కొండకు ఏమాత్రం నష్టం జరగలేదు. కానీ గొర్రెపోతు రెండు కొమ్ములు విరిగిపోయాయి. తీవ్ర నొప్పితో అది కుప్పకూలింది. అప్పుడు తన అహంకారం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించింది.
ఆ రోజు నుంచి గొర్రెపోతు వినయంగా ఉండటం ప్రారంభించింది. ఇతర జంతువులను ఇబ్బంది పెట్టడం మానేసి, అందరితో స్నేహపూర్వకంగా మెలగడం నేర్చుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















