జావెలిన్ త్రో అంటే భారత క్రీడాభిమానులకు ముందుగా గుర్తుకొచ్చే పేరు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్.. ఆ తర్వాత కూడా అంతర్జాతీయ వేదికలపై వరుస విజయాలతో భారత జావెలిన్ త్రోకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. ఇప్పుడు నీరజ్‌తో పాటు భారత క్రీడాభిమానుల్లో మరో జావెలిన్ త్రో అథ్లెట్‌పై ఆశలు పెరుగుతున్నాయి. అతడే 24 ఏళ్ల యశ్వీర్ సింగ్.
కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించగా.. యశ్వీర్ సింగ్ కాంస్య పతకంతో మెరిశాడు. ప్రపంచ స్థాయి అథ్లెట్లతో కూడిన పోటీలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అండర్సన్ పీటర్స్, అర్షద్ నదీమ్, కెషోర్న్ వాల్‌కట్ వంటి హేమాహేమీల మధ్య పోటీ పడుతూ పోడియం చేరడం యశ్వీర్ కెరీర్‌లోనే కీలక మైలురాయిగా నిలిచింది.
యశ్వీర్‌కు పోటీ అంత సులభంగా సాగలేదు. అతడి తొలి త్రో ఫౌల్‌గా మారింది. నాలుగో ప్రయత్నం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అప్పటికే 81.33 మీటర్ల త్రోతో రేసులో ఉన్నప్పటికీ.. పతకం కోసం మరింత మెరుగైన ప్రదర్శన అవసరమైంది. చివరి ప్రయత్నానికి ముందు నీరజ్ చోప్రా ఇచ్చిన ప్రోత్సాహం యశ్వీర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తన రన్నప్‌లో మార్పులు చేసుకుని చివరి త్రోలో ఏకంగా 85.41 మీటర్ల దూరం విసిరాడు. దీంతో మూడో స్థానాన్ని ఖరారు చేసుకుని కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
తండ్రి బాటలో జావెలిన్ త్రో ప్రయాణం
రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతానికి చెందిన యశ్వీర్ చిన్నతనంలో బాస్కెట్‌బాల్ ఆడేవాడు. శారీరక దృఢత్వం, ఫిట్‌నెస్ కోసం ఆ క్రీడను ఎంచుకున్న అతడు.. ఆ తర్వాత జావెలిన్ త్రో వైపు అడుగులు వేశాడు. అయితే అతడి ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ప్రొఫెషనల్ స్థాయికి చేరుకునే ముందు వెదురు కర్రలతోనే సాధన చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు.యశ్వీర్ తండ్రి రాయ్ సింగ్ కూడా జాతీయ స్థాయి జావెలిన్ త్రో అథ్లెట్. తండ్రి నుంచి క్రీడా మెలకువలు నేర్చుకున్న యశ్వీర్.. కఠిన శ్రమ, క్రమశిక్షణ, నిరంతర సాధనను తన విజయానికి పునాదులుగా మార్చుకున్నాడు. ‘‘కఠినంగా శ్రమిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది’’ అనే తండ్రి మాటలను జీవిత సూత్రంగా తీసుకున్నాడు.
తన అథ్లెటిక్ కెరీర్‌లో తాను చేసిన తప్పులను కుమారుడు చేయకుండా ఉండేందుకు రాయ్ సింగ్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా సాధన చేయడం, ఎక్కువ సమయం శిక్షణకు కేటాయించడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. తండ్రి మార్గదర్శకత్వం, యశ్వీర్ కఠోర శ్రమ కలిసి అతడిని అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా తీర్చిదిద్దాయి.
రికార్డులతో మొదలైన గుర్తింపు
యశ్వీర్ ప్రతిభ తొలిసారిగా యూ-20 ఫెడరేషన్ కప్‌లో వెలుగులోకి వచ్చింది. అక్కడ నీరజ్ చోప్రా పేరిట ఉన్న రికార్డును అధిగమించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2022లో 80 మీటర్ల మార్క్‌ను అధిగమించిన భారత అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 82.57 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచాడు.
ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో 85.41 మీటర్ల కెరీర్ బెస్ట్ త్రోతో కాంస్య పతకం సాధించి మరోసారి తన సత్తా చాటాడు. ఈ విజయంతో భారత జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా తర్వాతి తరం ఆశాకిరణంగా యశ్వీర్ సింగ్ నిలిచాడు. భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ పోటీల్లోనూ నీరజ్‌తో కలిసి భారత పతక ఆశలను మోసే అథ్లెట్‌గా యశ్వీర్ ఎదగాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















