విజయవాడలో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కేరళకు చెందిన మహ్మద్ సొహైల్ పోలీసుల కస్టడీ నుంచి పరారవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితుడు తప్పించుకున్న విషయం బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రత్యేక బృందాలు అతని కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ నెల 9న విజయవాడ శివారు నిడమానూరులో ఈగల్ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఓ లారీలో 140 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది. లారీ డ్రైవర్లను విచారించగా ఒడిశా నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు గంజాయిని తరలిస్తున్నట్లు బయటపడింది. అనంతరం డ్రైవర్ల ద్వారా సేకరించిన సమాచారంతో గంజాయి రవాణా నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక వ్యక్తులను అధికారులు గుర్తించారు.
దీంతో కేరళకు చెందిన మహ్మద్ సొహైల్‌తో పాటు ఒడిశాకు చెందిన అరూప్ సింగ్, రాజేశ్‌కుమార్ సింగ్‌లను విశాఖపట్నంలో అదుపులోకి తీసుకుని పటమట పోలీసులకు అప్పగించారు. అయితే విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈ నెల 11న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో సొహైల్ పోలీసుల కళ్లుగప్పి కస్టడీ నుంచి పరారయ్యాడు.
ప్రధాన నిందితుడు కోర్టులో హాజరుపరచకముందే తప్పించుకోవడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. ఈ ఘటనపై నగర పోలీసు కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కస్టడీలో ఉన్న నిందితుడిపై సరైన నిఘా లేకపోవడమే ఈ ఘటనకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై శాఖాపరమైన విచారణ చేపట్టే అవకాశమూ కనిపిస్తోంది.
పోలీసుల దర్యాప్తులో సొహైల్ దేశవ్యాప్తంగా విస్తరించిన గంజాయి అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది. ఒడిశాలో గంజాయి పండించే ప్రాంతాల నుంచి నేరుగా సరుకు కొనుగోలు చేసి, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తరలించే వ్యవస్థను అతడు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పాత కార్ల కొనుగోలు, విక్రయాల వ్యాపారం ముసుగులో గంజాయి రవాణా సాగిస్తున్నాడని అధికారులు అనుమానిస్తున్నారు.
సొహైల్ స్వస్థలం కేరళ రాష్ట్రంలోని మళప్పురం జిల్లా చేరుకర గ్రామం కావడంతో అక్కడికి ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించారు. అతని బంధువులు, సన్నిహితుల కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన మిగిలిన ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ప్రధాన నిందితుడు పరారవడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అతడిని త్వరగా పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య సమన్వయంతో గాలింపు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















