ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేపాల్‌లో ఉద్యోగుల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై లేఆఫ్‌ల ప్రభావం పడినట్లు సమాచారం. తొలుత సుమారు 600 మంది ఉద్యోగాలను తొలగించినట్లు వార్తలు వెలువడగా.. ఈ సంఖ్యపై పేపాల్ భారత విభాగం స్పష్టత ఇచ్చింది. లేఆఫ్‌ల ప్రభావం 220 మంది ఉద్యోగులపైనే పడినట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
భారత్‌లో పేపాల్‌కు 6 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఇందులో దాదాపు 10 శాతం మేర ఉద్యోగాల కోత విధించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో 220 మంది ఉద్యోగులు ఈ పునర్‌వ్యవస్థీకరణ ప్రభావానికి గురయ్యారు. టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆపరేషన్స్, చెల్లింపులు, ఆర్థిక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
కార్యకలాపాలను మరింత సరళీకరించడం, అమలు సామర్థ్యాన్ని పెంచడం, దీర్ఘకాలిక వృద్ధికి అనుగుణంగా సంస్థను సిద్ధం చేయడంలో భాగంగానే ఈ మార్పులు చేపట్టినట్లు పేపాల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థ చేపడుతున్న పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే భారత్‌లోనూ ఉద్యోగాల కోత జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 31న నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్‌లో ఉద్యోగాల కోత విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. అనంతరం కొద్దిసేపటికే సంస్థకు సంబంధించిన వ్యవస్థలు, సాఫ్ట్‌వేర్‌లకు తమ యాక్సెస్‌ను నిలిపివేశారని ఉద్యోగులు చెబుతున్నారు. మరికొందరికి నేరుగా ఈ-మెయిల్ ద్వారా తొలగింపు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల తొలగింపు అనంతరం ఔట్‌బోర్డింగ్ ప్రక్రియను చేపట్టడంతోపాటు నెల జీతాన్ని అందించనున్నట్లు సంస్థ తెలిపినట్లు సమాచారం. ఉద్యోగాల కోత నిర్ణయం ఒక్క భారత్‌కే పరిమితం కాకుండా.. పేపాల్ ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న పునర్‌వ్యవస్థీకరణలో భాగమని తెలుస్తోంది.
2025 డిసెంబరు నాటికి పేపాల్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 23,800 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సంస్థ వ్యయాలను నియంత్రించడం, కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడం, భవిష్యత్తు వృద్ధికి అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని మార్చడంలో భాగంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సంబంధించిన ప్రణాళికలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు భారత్‌లో చోటుచేసుకున్న లేఆఫ్‌లు కూడా అదే ప్రక్రియలో భాగంగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















