తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు కూడా నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు.
మహిళా సభ్యులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. తిరిగి వారిపైనే అక్రమ కేసులు నమోదు చేశారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాష్ట్రంలోని యావత్ మహిళలకు జరిగిన అవమానంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా సభ్యుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు. ‘‘మీరు చెబితే నేను వినట్లేదా.. ఎందుకంత ఆవేశం. ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి’’ అంటూ హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా స్పీకర్ భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ సభ్యుల గురించి సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ.. ‘‘నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు’’ అని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి తదితర మహిళా సభ్యుల పట్ల తనకు కూడా గౌరవం ఉందన్నారు. తనకు ఉన్న అక్కాచెల్లెళ్లతో పాటు వారిని కూడా సోదరీమణులుగానే భావిస్తానని తెలిపారు.
మహిళా సభ్యుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై నివేదిక కోరినట్లు స్పీకర్ తెలిపారు. నివేదిక అందిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ తీరుపై శ్రీధర్‌బాబు ఆగ్రహం
శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. స్పీకర్‌ను బెదిరించే ధోరణిలో బీఆర్‌ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు.
సభలో ఏదైనా ఇబ్బంది ఉందని భావిస్తే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుందని చెప్పారు. సభను ఎలా నడపాలో విపక్ష సభ్యులు స్పీకర్‌కు చెప్పడం సరికాదన్నారు. స్పీకర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఆయనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు, రికార్డులను ప్రజల ముందుంచితే అసలు వాస్తవాలు స్పష్టమవుతాయని శ్రీధర్‌బాబు అన్నారు. మహిళా సభ్యుల అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేసినప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశాన్ని పక్కన పెట్టాలని బీఆర్‌ఎస్ సభ్యులు కోరడం సరికాదన్నారు. సభాపతిని కించపరిచేలా మాట్లాడితే అది తప్పని చెప్పాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని స్పష్టం చేశారు.
క్షమాపణలు చెప్పకుండా రాజకీయం చేస్తున్నారన్న మంత్రి
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల విషయంలో బీఆర్‌ఎస్ సభ్యులు క్షమాపణలు చెప్పకుండా రాజకీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్ష సభ్యులందరిపైనా ఉందన్నారు.
మహిళా సభ్యుల అంశం, స్పీకర్‌పై వ్యాఖ్యలు.. ఇలా రెండు అంశాలు కలిసిపోవడంతో అసెంబ్లీలో వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















