ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యూరప్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో (గిడ్డంగి కేంద్రాల్లో) కార్యకలాపాలను మరింత ఆటోమేషన్ దిశగా మార్చుతోంది. ఇందులో భాగంగా శారీరక శ్రమతో కూడిన పనులను నిర్వహించేందుకు కార్మికుల స్థానంలో ప్రొటియస్ రోబోను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త రోబోటిక్ సిస్టమ్ ద్వారా సిబ్బందిపై పని భారం తగ్గడమే కాకుండా, వారు నాణ్యత నియంత్రణ, సరుకు నిర్వహణ వంటి అధిక నైపుణ్యం అవసరమైన పనులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని అమెజాన్ తెలిపింది. ప్రత్యేకంగా ఈ ప్రొటియస్ రోబోను ఉపయోగించడానికి ఎలాంటి క్లిష్టమైన ప్రోగ్రామింగ్ లేదా సాంకేతిక ఇంటర్‌ఫేస్ అవసరం లేదని సంస్థ పేర్కొంది. ఉద్యోగులు సాధారణ సంభాషణ భాషలోనే రోబోకు సూచనలు ఇవ్వగలరని, అది సహోద్యోగిలా స్పందిస్తుందని వివరించింది.
అధిక బరువున్న వస్తువులను తరలించడం, ఎక్కువ దూరం ప్రయాణించడం వంటి శారీరక శ్రమతో కూడిన పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రొటియస్‌ను రూపొందించినట్లు అమెజాన్ తెలిపింది. దీని వల్ల పని వేగం పెరగడంతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని సంస్థ అభిప్రాయపడుతోంది.
ఇదే సమయంలో స్పర్శ జ్ఞానం కలిగిన “వల్కన్” రోబో వినియోగాన్ని కూడా అమెజాన్ విస్తరిస్తోంది. ఈ సాంకేతికతలు గిడ్డంగి కార్యకలాపాల్లో కొత్త దశను ప్రారంభిస్తాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
యూరప్‌లోని ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల విస్తరణ, ఆధునీకరణ కోసం రాబోయే కొన్ని సంవత్సరాల్లో 10 బిలియన్ యూరోల (సుమారు రూ.1.10 లక్షల కోట్లు)కు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అలాగే ఉద్యోగుల సంఖ్యను 25,000 వరకు పెంచాలని ప్రణాళిక రూపొందించింది.
డెలివరీ రంగంలో పర్యావరణ అనుకూల మార్పులపై కూడా అమెజాన్ దృష్టి పెట్టింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డెలివరీ కోసం లక్ష విద్యుత్ వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. 2025 చివరికి ఈ సంఖ్యను 50,000కు చేర్చినట్లు కంపెనీ తెలిపింది.
భారత్‌లో ఇప్పటికే 10,000కి పైగా విద్యుత్ డెలివరీ వాహనాలు వినియోగంలో ఉన్నాయి. వీటికి అదనంగా మరో 1,000 విద్యుత్ తేలికపాటి, మధ్యస్థాయి ట్రక్కులను ప్రవేశపెట్టాలని అమెజాన్ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో 80 శాతానికి పైగా డెలివరీలు ద్విచక్ర వాహనాల ద్వారానే జరుగుతున్నాయని సంస్థ వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















