చిన్నప్పుడు రేడియోలో చిరంజీవి పాట వినిపిస్తే చాలు.. ఆ పాటలోని లయకు అనుగుణంగా చిందులేసిన తరం ఒకటి. వెండితెరపై ఆయన డ్యాన్స్ చూస్తూ మైమరచిపోయిన మరో తరం. ఇప్పుడు అదే స్టెప్పులను రీల్స్‌లో వేసుకుంటూ, షార్ట్స్‌లో అనుకరిస్తున్న జెన్‌జీ తరం. తరాలు మారినా.. వేదికలు మారినా.. చిరంజీవి డ్యాన్స్‌పై క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.
నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి నేడు 71వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా అభిమానుల్లో సంబరం అంబరాన్నంటుతోంది. నటన, డ్యాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని కోణాల్లో ప్రేక్షకులను అలరించిన చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన అంశాల్లో డ్యాన్స్ ఒకటి.
90s కిడ్స్‌కు ఓ అందమైన జ్ఞాపకం :
90s కిడ్స్ చిన్నతనంలో పాటలు వినడానికి రేడియో, టేప్ రికార్డర్, వాక్‌మ్యాన్, సీడీ ప్లేయర్ వంటి ఎన్నో మాధ్యమాలు ఉండేవి. కాలక్రమంలో అవన్నీ మారిపోయి ఇప్పుడు యూట్యూబ్, స్పాటిఫై వంటి డిజిటల్ వేదికలు వచ్చాయి. కానీ చిరంజీవి పాటలను ఆస్వాదించే విషయంలో మాత్రం ఆ తరానికి ఎలాంటి మార్పూ రాలేదు.
‘గ్యాంగ్ లీడర్’లోని ‘జీ..ఏ..ఎన్..జీ.. గ్యాంగ్ గ్యాంగ్..’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లోని ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’, ‘ఘరానా మొగుడు’లోని ‘బంగారు కోడిపెట్ట’.. ఇలా ఎన్నో పాటలు ఇప్పటికీ 90s కిడ్స్ ప్లేలిస్టుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ‘ముఠామేస్త్రి’, ‘హిట్లర్’, ‘బావగారూ బాగున్నారా?’, ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ వంటి సినిమాల్లోని పాటలు, వాటిలో చిరు వేసిన స్టెప్పులు అభిమానులకు ఇప్పటికీ నోస్టాల్జియానే.
రీయూనియన్ పార్టీల్లో చిరు పాటల సందడే! :
90s కిడ్స్ రీయూనియన్ పార్టీల్లో చిరంజీవి పాటలు వినిపిస్తే సందడి మామూలుగా ఉండదు. పాట మొదలవ్వగానే అప్పట్లో చూసిన స్టెప్పులు గుర్తొచ్చి.. స్నేహితులంతా కలిసి వాటిని అనుకరించడం కనిపిస్తుంటుంది. ఒక్కో పాటకు ఒక్కో స్టెప్పు ప్రత్యేక గుర్తింపుగా మారిపోయింది. అందుకే చిరు పాటలు కేవలం వినోదం మాత్రమే కాదు.. ఓ తరం బాల్య జ్ఞాపకాల్లో భాగమయ్యాయి.
జెన్‌జీకి కూడా అదే వైబ్! :
ఇక జెన్‌జీ తరం కూడా చిరంజీవి గ్రేస్‌కు ఫిదా అవుతోంది. రీల్స్, షార్ట్స్‌లో చిరంజీవి పాటలకు యువత స్టెప్పులేస్తూ కనిపిస్తోంది. కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలైనా, ఫేర్‌వెల్ వేడుకలైనా, సోషల్ మీడియా ఛాలెంజ్‌లైనా చిరు పాటలు తప్పనిసరిగా వినిపిస్తున్నాయి.
‘ఖైదీ నంబర్ 150’లోని ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’, ‘వాల్తేరు వీరయ్య’లోని ‘పూనకాలు లోడింగ్’, తాజాగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’లోని ‘మీసాల పిల్లా’ వంటి పాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిరంజీవి ప్రత్యేక శైలిలో వేసే స్టెప్పులను యువత రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
ప్లాట్‌ఫామ్‌లు మారినా.. క్రేజ్ మారలేదు :
ఒకప్పుడు చిరంజీవి పాటల కోసం రేడియో, క్యాసెట్లు, సీడీలు ఆశ్రయిస్తే.. ఇప్పుడు అదే పాటలు డిజిటల్ వేదికల్లో ట్రెండ్ అవుతున్నాయి. అప్పట్లో థియేటర్లలో చిరు డ్యాన్స్‌కు అభిమానులు ఈలలు వేస్తే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన స్టెప్పులను యువత రీక్రియేట్ చేస్తోంది.
అందుకే చిరంజీవి కేవలం ఓ తరం హీరో కాదు. 90s కిడ్స్‌కు ఆయన బాల్య జ్ఞాపకం.. నేటి జెన్‌జీకి ఓ వైబ్. వయసు ఏడు పదులు దాటినా ఆయన డ్యాన్స్ చూస్తే అభిమానుల్లో వచ్చే ఉత్సాహం మాత్రం కుర్ర హీరోలకేం తీసిపోదు. తరాలు మారుతున్నా.. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మాత్రం అలాగే కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















