లక్ష్యసేన్‌కు అనూహ్య షాక్ ఇచ్చిన గారెట్ టాన్ ఎవరు?
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అనూహ్యంగా రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 14వ సీడ్‌గా బరిలోకి దిగిన లక్ష్యను.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 92వ స్థానంలో ఉన్న 18ఏళ్ల అమెరికా ఆటగాడు గారెట్ టాన్ ఓడించి సంచలనం సృష్టించాడు. ఆసక్తికరంగా.. ఈ టోర్నీలో తన ప్రయాణం శుక్రవారంతో ముగుస్తుందని భావించిన టాన్ ముందుగానే రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. కానీ లక్ష్యపై అద్భుత విజయం సాధించడంతో అతడి ప్రయాణం మరో దశకు చేరింది.
తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనే సంచలనం
73 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో టాన్ దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌ను 19-21తో కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా 21-19, 21-17తో రెండు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొంటూనే ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.
జూనియర్ స్థాయిలో నంబర్‌వన్
కాలిఫోర్నియాకు చెందిన గారెట్ టాన్ ఎనిమిదేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేశాడు. జూనియర్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన టాన్.. గతేడాది పాన్ ఆమ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది సీనియర్ సర్క్యూట్‌లోకి వచ్చిన అతడు.. బ్రెజిల్ ఇంటర్నేషనల్, సైపాన్ ఇంటర్నేషనల్ టోర్నీల్లో సెమీఫైనల్స్ వరకు చేరుకున్నాడు.
ఇద్దరు మహిళా కోచ్‌ల వద్ద శిక్షణ
గారెట్ టాన్ శిక్షణలోనూ ప్రత్యేకత ఉంది. చిన్నప్పటి నుంచి 41 ఏళ్ల పౌలా లిన్ వద్ద బ్యాడ్మింటన్ మెళకువలు నేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె అమెరికా జట్టు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు 23 ఏళ్ల లారెన్ లామ్ కూడా టాన్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆసక్తికరంగా.. ఆమె ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలోనూ పోటీపడుతున్నారు.
ఇక ముందున్న సవాల్ మరింత కఠినం
లక్ష్యసేన్‌పై సంచలన విజయం సాధించిన గారెట్ టాన్.. ప్రీక్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్, థాయ్‌లాండ్ స్టార్ షట్లర్ కున్లావుట్ విటిడ్సార్న్‌ను ఎదుర్కోనున్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















