జెన్ జీ తరం ఆర్థిక విషయాల్లో గత తరాలతో పోలిస్తే ముందుగానే అవగాహన పెంచుకుంటోంది. ఉద్యోగం ప్రారంభించిన కొద్దికాలానికే పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెడుతోంది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియా ప్రభావం, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన యువతను అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల వైపు తీసుకెళ్తోంది. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం, ఊహాగానాలతో డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించడం రెండూ ఒకటి కాదన్న విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి.
చిన్న వయసులో పెట్టుబడులు ప్రారంభించడం వల్ల కాలం అనే ప్రయోజనం మదుపరికి లభిస్తుంది. మార్కెట్‌లో తాత్కాలిక హెచ్చుతగ్గులు వచ్చినా దీర్ఘకాలం కొనసాగితే వాటి ప్రభావాన్ని కొంతవరకు అధిగమించే అవకాశం ఉంటుంది. అందుకే యువత తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేసి, తమ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను విభజించుకోవాలి.
అధిక రాబడి వస్తుందని చెప్పే ప్రతి పెట్టుబడి మంచిదని భావించకూడదు. రాబడి పెరిగే కొద్దీ నష్టపోయే అవకాశమూ పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాలి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలు, అధిక ఊగిసలాట ఉండే షేర్లు, బెట్టింగ్ వంటి వాటిని ఒకే గాటన పెట్టుబడులుగా చూడకూడదు. ఒకదానిలో పెట్టిన డబ్బు పెరగొచ్చనే ఆశతో మొత్తం పొదుపును అందులో పెట్టడం తీవ్ర ఆర్థిక నష్టానికి దారితీయొచ్చు.
పెట్టుబడులు ప్రారంభించే ముందు కనీసం కొన్ని నెలల ఖర్చులకు సరిపడే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. అనుకోని పరిస్థితుల్లో పెట్టుబడులను నష్టానికి విక్రయించాల్సిన అవసరం లేకుండా ఇది రక్షణగా ఉంటుంది. అదే సమయంలో అధిక వడ్డీ ఉన్న అప్పులు ఉంటే వాటిని తీర్చడానికీ ప్రాధాన్యం ఇవ్వాలి.
పెట్టుబడి ఎందుకు చేస్తున్నామన్నది స్పష్టంగా ఉండాలి. ఇల్లు కొనడం, ఉన్నత విద్య, పదవీ విరమణ, కుటుంబ భద్రత వంటి దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి ప్రణాళిక ఉండాలి. ఐదేళ్లలో అవసరమయ్యే డబ్బును అత్యంత ప్రమాదకరమైన పెట్టుబడిలో పెట్టడం సరైన నిర్ణయం కాదు. పెట్టుబడి కాలవ్యవధిని బట్టి సాధనాలను ఎంచుకోవాలి.
మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పడిపోతుంది అని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. అందుకే ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టడం కంటే, తమ సామర్థ్యానికి అనుగుణంగా క్రమం తప్పకుండా పెట్టుబడి చేయడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని సమతుల్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏ పథకంలోనైనా పెట్టుబడి పెట్టే ముందు దాని రిస్క్, ఖర్చులు, గత పనితీరు, పెట్టుబడి విధానం వంటి అంశాలను అర్థం చేసుకోవాలి.
పెట్టుబడులు ఎంత ముఖ్యమో కుటుంబ ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. కుటుంబంపై ఆర్థిక బాధ్యత ఉన్నవారు తగిన జీవిత బీమాను, తమ అవసరాలకు సరిపోయే ఆరోగ్య బీమాను తీసుకోవాలి. అనుకోని ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఏళ్ల తరబడి కూడబెట్టిన పెట్టుబడులు ఖర్చైపోకుండా బీమా రక్షణగా నిలుస్తుంది..
మార్కెట్‌లో గెలవడానికి వేగం కంటే సహనం ముఖ్యం. ఇతరులు ఎంత సంపాదిస్తున్నారన్నది చూసి నిర్ణయాలు తీసుకోకుండా.. మన ఆదాయం, లక్ష్యాలు, రిస్క్ భరించే సామర్థ్యానికి తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టాలి. జెన్ జీకి చిన్న వయసే పెద్ద బలం. ఆ సమయాన్ని తొందరపాటు నిర్ణయాలతో కాకుండా, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాల మదుపుతో ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛ సాధించే అవకాశాలు మెరుగవుతాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















