వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో బీమాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సుమిత్ మదన్ అన్నారు. బీమాను కేవలం పన్ను ఆదా లేదా పొదుపు సాధనంగా కాకుండా.. కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే రక్షణ కవచంగా చూడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువు, ఇంటి రుణాలు, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని తగినంత బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలని సూచించారు.
గతంలో చాలామంది బీమా పాలసీలను పన్ను ఆదా లేదా పొదుపు కోణంలోనే చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆర్థిక విషయాలపై అవగాహన పెరగడం, డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడం, పాలసీదారులకు అనుకూలంగా నియంత్రణలు మారడం వంటి కారణాలతో బీమాను సమగ్ర ఆర్థిక ప్రణాళికలో కీలక భాగంగా గుర్తించే ధోరణి పెరుగుతోంది. ఏదో ఒక పాలసీ తీసుకున్నామా లేదా అన్నది కాకుండా.. కుటుంబానికి అవసరమైనంత రక్షణ ఉందా లేదా అన్నదే ముఖ్యమని సుమిత్ మదన్ వివరించారు.
దేశంలో జీవిత బీమా వ్యాప్తి 2.7 శాతంగా ఉందని, సాధారణ బీమాను కలిపితే మొత్తం బీమా విస్తృతి 3.7 శాతంగా నమోదైందని ఆయన తెలిపారు. ప్రపంచ సగటు 7.3 శాతంతో పోలిస్తే ఇది తక్కువేనని పేర్కొన్నారు. దక్షిణాదిలో 77 శాతం మంది టర్మ్ ఇన్సూరెన్స్ అవసరమని భావిస్తున్నప్పటికీ.. దాన్ని కొనుగోలు చేసే విషయంలో వెనుకంజ వేస్తున్నారని చెప్పారు.
అందువల్ల బీమాపై అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్య కాదని.. నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యమే పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు. తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ అందించే టర్మ్ పాలసీలను మరింత అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ప్రాంతీయ భాషల్లో సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
బీమా రంగంలో ఇటీవల చోటుచేసుకున్న నియంత్రణపరమైన మార్పులు పాలసీదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని సుమిత్ మదన్ అన్నారు. ప్రీమియం భారం తగ్గించే చర్యలు, అవసరం లేని పాలసీలను బలవంతంగా విక్రయించడాన్ని నిరోధించే నిబంధనలు వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయని తెలిపారు.
బీమా సుగమ్ వంటి డిజిటల్ వేదికలు అందుబాటులోకి రావడంతో పాలసీలను పోల్చి చూసుకోవడం, కొనుగోలు చేయడం, క్లెయిమ్ ప్రక్రియను సులభంగా నిర్వహించుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీంతో బీమా సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా మారే అవకాశం ఉందన్నారు.
బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం కీలక సంస్కరణగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, కొత్త తరహా బీమా ఉత్పత్తులు దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
పెరిగే పోటీతో పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు, ఆకర్షణీయమైన ధరలు, వేగవంతమైన క్లెయిమ్ పరిష్కారాలు అందుబాటులోకి రావచ్చని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు సైతం బీమా సేవలను విస్తరించేందుకు ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని చెప్పారు.
దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పదవీ విరమణ ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సుమిత్ మదన్ పేర్కొన్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 15.3 కోట్లుగా ఉంటే.. 2050 నాటికి 34.7 కోట్లకు చేరుకోవచ్చని అంచనా ఉందన్నారు.
పదవీ విరమణ తర్వాత దీర్ఘకాలం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. చిన్న వయసు నుంచే క్రమశిక్షణతో పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు.
బీమాను వాయిదా వేయడం వల్ల భవిష్యత్తులో కుటుంబంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఆదాయం, కుటుంబ సభ్యుల సంఖ్య, బాధ్యతలు, అప్పులు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా బీమా రక్షణను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.
చాలామంది తమకు అవసరమైన మొత్తంతో పోలిస్తే తక్కువ మొత్తానికే బీమా తీసుకుంటున్నారని తెలిపారు. తగినంత జీవిత బీమా ఉంటే కుటుంబ పెద్దకు అనుకోని పరిస్థితి ఎదురైనా పిల్లల విద్య, ఇంటి రుణాలు, ఇతర ఆర్థిక లక్ష్యాలు మధ్యలో ఆగిపోకుండా కాపాడుకోవచ్చన్నారు. అందుకే బీమాను రేపటికి వాయిదా వేయకుండా.. కుటుంబ భవిష్యత్తుకు అవసరమైన రక్షణను ఇప్పుడే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















