సిరిసిల్లలో జీ+1 వరకు అనుమతి ఉన్న ప్రాంతంలో జీ+2 నిర్మాణం చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ, చర్యలు తీసుకోకుండా ఉండేందుకు యజమాని రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పక్కింటివారి అభ్యంతరంతో వ్యవహారం బయటపడింది.
అంబికానగర్‌లో ఆసుపత్రి నిర్వహిస్తున్న వాణిజ్య భవనాన్ని నివాస గృహంగా చూపించి తక్కువ మొత్తంలో ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పురపాలికకు ఏటా సుమారు రూ.5 లక్షల ఆదాయం కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది.
వేములవాడలో రాజన్న ఆలయం సమీపంలోని కూరగాయల మార్కెట్‌లో నిర్మిస్తున్న వాణిజ్య సముదాయంలో సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది.
నిజామాబాద్ నగరంలో నిబంధనలు ఉల్లంఘించి భారీ భవనాలు నిర్మిస్తున్న 59 మంది యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అనుమతులు లేకుండా భారీ భవనం నిర్మించడంతోపాటు నాలాను ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మహబూబాబాద్ పురపాలికలోని పలు వార్డుల్లో సెట్‌బ్యాక్ వదలకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా చర్యలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోనే భారీ అంతస్తులతో భవనాలు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాదన్నపేట రోడ్డు, ఎన్జీవోస్ కాలనీ, వల్లభనగర్, సర్వాపురం తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అనుమతులు లేకుండానే నాలుగు అంతస్తుల వాణిజ్య భవనం నిర్మించగా.. అందులో ప్రైవేటు ఆసుపత్రి కొనసాగుతోంది. గత ఆర్నెల్లలో నిబంధనల ఉల్లంఘనలపై 38 ఫిర్యాదులు అందగా, 15 మంది యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. పట్టణ శివారులోని సర్వే నంబరు 4లో నిర్మాణాలపై నిషేధం ఉన్నప్పటికీ భారీగా భవనాలు వెలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పట్టణాల్లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాల్లో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం నాలాల ఆక్రమణ. వర్షపు నీరు వెళ్లే మార్గాలను ఆక్రమించి భవనాలు నిర్మించడంతో భారీ వర్షాల సమయంలో వరద ముప్పు పెరుగుతోంది. రహదారుల వెడల్పు తగ్గించడం, సెట్‌బ్యాక్‌లు వదలకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి.
అక్రమ నిర్మాణాలను అధికారులు పట్టించుకోకపోవడంతో మున్సిపాలిటీలకు మరోవైపు ఆస్తిపన్ను రూపంలోనూ ఆదాయం కోల్పోతోంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న భవనాలను నివాస గృహాలుగా చూపించడం, అదనపు అంతస్తులను పన్ను పరిధిలోకి తీసుకురాకపోవడం వంటి అక్రమాల వల్ల స్థానిక సంస్థల ఖజానాకు భారీగా గండి పడుతోంది.
500 చదరపు మీటర్లకు పైగా స్థలంలో నిర్మించే భవనాలు, వాణిజ్య సముదాయాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నారు. జీ+5 వరకు నిర్మాణాలకు 30 అడుగుల రహదారి, అంతకుమించి ఎత్తైన భవనాలకు 60 నుంచి 80 అడుగుల వరకు రహదారి ఉండాల్సి ఉంటుంది.
16 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు నాలుగు వైపులా కనీసం మూడు మీటర్ల చొప్పున స్థలం వదలాల్సి ఉంటుంది. వెయ్యి గజాల స్థలంలో నిర్మాణం చేపడితే ముందు భాగంలో పది అడుగులు, మిగిలిన మూడు వైపులా 13 అడుగుల చొప్పున సెట్‌బ్యాక్ ఉండాలి. 900 గజాలకు పైగా స్థలంలో చేపట్టే నిర్మాణాలకే సెల్లార్ ఏర్పాటుకు అనుమతి ఉంటుంది.
నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటి అమలులోనే అసలు సమస్య తలెత్తుతోంది. అక్రమ నిర్మాణాలను మొదటిదశలోనే అడ్డుకోకుండా.. పూర్తయిన తర్వాత నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. అధికారులు కఠినంగా వ్యవహరించడంతోపాటు రాజకీయ జోక్యాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటేనే పట్టణాల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















