వేసవి అంటే మామిడి కాయల సీజన్. కొందరు వ్యాపారులు అత్యాశతో పండ్లను విషతుల్యం చేస్తున్నారు. కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారు. వాటి వినియోగంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలోని పందిళ్లపల్లి, కడవకుదురు, వేటపాలెం, చినగంజాం, చెరుకుపల్లి, నగరం, ఖాజీపాలెం, గణపవరం గ్రామాల్లో 700 హెక్టార్లకుపైగా మామిడి తోటలు సాగు చేస్తున్నారు. వ్యాపారులు జిల్లాతోపాటు నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచీ కాయల్ని దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు.
2011 ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనల ప్రకారం… ప్రభుత్వం కార్బైడ్, ఎసిటలిన్ రసాయనాల్ని నిషేధించింది. సహజంగా పండించే ఇథిలీన్‌ను మాత్రమే 100 పీపీఎం వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది. నిబంధనల ప్రకారం సుమారు 20 కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథిలీన్ వినియోగించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు మేలిమి పండులా కనిపించేందుకు కార్బైడ్ వినియోగిస్తున్నారు. ఇథిలీన్‌తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తుండటంతో వ్యాపారులు యథేచ్ఛగా వాడుతున్నారు.
రసాయనాలతో ముప్పు.. రసాయనాలతో పండించిన పండ్లను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలికంగా ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా క్యాన్సర్, అల్సర్, లివర్ , కిడ్ని, జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు, చేతుల తిమ్మిర్లు, నరాల బలహీనతలకు గురయ్యే అవకాశం ఉంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.
చట్టం ఏమి చెబుతోంది
ఆహార సురక్ష ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో పండ్లను మాగబెట్టకూడదు. నిబంధనలకు విరుద్ధంగా మాగబెట్టిన వారికి, అమ్మినవారికి ఏడాది జైలు, రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశముంది. అయితే కొన్నేళ్లుగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
వాటిని తింటే ఇబ్బందులు
‘కృత్రిమంగా పండించిన పండ్లను తిన్నవారికి వాంతులు, విరేచనాలు, దాహం ఎక్కువగా అవడం, కడుపులో తిప్పడం వంటి సమస్యలు వస్తాయి. వాటిని విరివిగా తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మామిడి పండ్లను తినే ముందు ఉప్పునీటిలో కడగాలి’ అని జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















