మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారనే ఆరోపణలతో 2008లో నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు వాదనలపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలను పరిశీలించినప్పుడు ఇది పూర్తిగా వ్యక్తిగత వివాదానికి సంబంధించిన వ్యవహారంలా కనిపిస్తోందని పేర్కొంది. వాదనలు కొనసాగుతున్న కొద్దీ పిటిషనర్ ఉద్దేశాలపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించింది.
ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నారనే ఆరోపణలతో 2008 జనవరి 23న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్షియర్స్, హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావుపై కేసు నమోదు చేసింది. దీనిపై మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. 2018 డిసెంబరు 31న హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు కేసును తెలంగాణ హైకోర్టుకు తిరిగి పంపింది. డిపాజిటర్లకు సొమ్ము అందలేదన్న ఫిర్యాదులు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు బహిరంగ ప్రకటన జారీ చేసి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో డిపాజిట్లు చేసినవారిలో ఎవరికైనా సొమ్ము అందకపోతే కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని విచారణలో వెల్లడైంది.
మరోవైపు డిపాజిటర్లకు వడ్డీతో కలిపి రూ.2,500 కోట్లకు పైగా చెల్లించినట్లు మార్గదర్శి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. డబ్బు తీసుకోవడానికి ముందుకు రాని డిపాజిటర్ల కోసం ఎస్క్రో ఖాతాలో నిధులు జమ చేసినట్లు, అందులో ప్రస్తుతం రూ.5.23 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు 2024 జూన్ 8న మృతి చెందారు. అనంతరం క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదంటూ మార్గదర్శి తరఫున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశాలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు 2025 ఆగస్టు 4న క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను రద్దు చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్ 2025 డిసెంబరు 19న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఈ వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు మరోసారి న్యాయపరమైన ఊరట లభించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















