మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలంటే మెకంజీ కైఫీయత్‌లను పరిశీలించాల్సిందే. శతాబ్దాల క్రితం గ్రామాల్లోని పరిస్థితులు, ప్రజల జీవన విధానం, భూములు, పన్నులు, చెరువులు, కాలువలు, వృత్తులు, దేవాలయాలు, జాతరలు, కరవు కాటకాలు, దండయాత్రలు వంటి అనేక అంశాలపై ఇందులో విలువైన సమాచారం లభిస్తుంది. 17, 18వ శతాబ్దాలకు చెందిన పలు వివరాలు కూడా వీటిలో నమోదై ఉన్నాయి.
గ్రామ కైఫీయత్‌లు కేవలం రాజులు, రాజ్యాల చరిత్రను మాత్రమే కాకుండా.. అప్పటి సామాన్య ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనాన్ని కూడా పరిచయం చేస్తాయి. గ్రామ సరిహద్దులు, వ్యవసాయ భూములు, బీడు భూములు, పన్నుల వివరాలతో పాటు గ్రామాన్ని ఎప్పుడు, ఎవరు పాలించారు అనే సమాచారాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కైఫీయత్‌లలో సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యాలు, తాళపత్రాల్లో నమోదైన వివరాలు కనిపిస్తాయి.
ఈ కైఫీయత్‌ల రూపకల్పనలో బ్రిటిష్ పాలనలో భారతదేశ తొలి సర్వేయర్ జనరల్‌గా పనిచేసిన కల్నల్ కొలిన్ మెకంజీ కీలక పాత్ర పోషించారు. తెలుగు పండితుల సహకారంతో వేలాది తాళపత్ర దండకవిలెలను పరిశీలించి గ్రామాల చరిత్రను సేకరించారు. అనంతరం వాటిని భద్రపరచడం, కాగితాలపైకి తీసుకురావడంలో భాషావేత్త సీపీ బ్రౌన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు నేటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు సంబంధించిన చారిత్రక సమాచారం కైఫీయత్‌లలో నమోదై ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ శాఖ వివిధ జిల్లాల గ్రామ కైఫీయత్‌లను పుస్తకాల రూపంలో ప్రచురించింది. వీటి ఆధారంగా పలువురు పరిశోధకులు గ్రామాల వారీగా చరిత్రను డిజిటల్ వేదికలపై కూడా నమోదు చేస్తున్నారు.
కైఫీయత్‌ల ప్రాధాన్యానికి వట్టిచెరుకూరు ఉదాహరణగా నిలిచింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ఇళ్ల స్థలాలు గ్రామకంఠంలోనే ఉన్నప్పటికీ వాటిని 22ఎ నిషేధిత జాబితాలో చేర్చడంతో గ్రామస్థులు సుదీర్ఘకాలంగా సమస్యను ఎదుర్కొన్నారు. 1722లోనే అక్కడ గ్రామం ఉన్నట్లు కైఫీయత్‌ల ద్వారా ఆధారాలు లభించడంతో ప్రభుత్వం ఇటీవల ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది. దీంతో 120 ఏళ్లకు పైగా కొనసాగిన సమస్యకు పరిష్కారం లభించింది.
అందుకే మీ గ్రామానికి సంబంధించిన కైఫీయత్ లభిస్తే.. దాన్ని కేవలం పాత పుస్తకంగా కాకుండా మీ ఊరి గతాన్ని పరిచయం చేసే చారిత్రక ఆధారంగా చూడొచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















