దేశంలో ఎల్పీజీ లభ్యతపై భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత సంక్షోభాన్ని కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
గురువారం జరిగిన ‘ఎన్‌ఎక్స్‌టీ’ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమ వ్యక్తిగత అజెండాను నడిపించేందుకు ప్రజల్లో అనవసర భయాన్ని పెంచుతున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఈ సంక్షోభాన్ని అధిగమించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక ఎల్పీజీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వశాఖ పలు చర్యలు చేపట్టింది. వంట ఇంధనంగా ఉపయోగించే కిరోసిన్ సరఫరాను పెంచుతూ అదనంగా 48 వేల కిలోలీటర్లను రాష్ట్రాలకు కేటాయించింది. అలాగే అవసరమైన చోట్ల మరిన్ని వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆతిథ్య, రెస్టారెంట్ రంగాల్లో బయోమాస్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించేందుకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని కేంద్రం సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ బుకింగ్ గడువును 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచినట్లు కూడా వెల్లడించింది.
ఇదిలా ఉండగా దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. 33 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ తెలిపారు. బుక్ చేసిన రెండు నుంచి మూడు రోజుల్లోనే సిలిండర్లు ఇళ్లకు చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వదంతుల కారణంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు. కొన్నిచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేయగా.. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం కట్టెలపై వంటలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వాలు సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















