తెగిపడిన విద్యుత్ తీగలు యమపాశాలుగా మారాయి. మూడు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా నాతవరం, బాపట్ల జిల్లా చెరువు ఉప్పరపాలెం, కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో గురువారం తెల్లవారుజామున ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
నాతవరంలో తల్లీకూతుళ్లు విద్యుదాఘాతానికి గురై మృతిచెందగా.. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. నాతవరం వాసి గొంప అప్పారావు కుమార్తె జానకి(28)కి తమ్మయ్యపాలేనికి చెందిన రొంగలి నాగరాజుతో వివాహమైంది. కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన ఆమె 15 రోజుల క్రితం మగశిశువుకు జన్మనిచ్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో అప్పారావు ఇంటి పైభాగంలో ఉన్న సర్వీసు తీగలకు ఎర్త్వైర్ తగిలి వాకిలిలో తెగిపడింది. గురువారం తెల్లవారుజామున జానకి బయటకు వస్తూ నేలపై పడి ఉన్న తీగను కాలితో పక్కకు తప్పించేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. నేలపై పడి ఉన్న కుమార్తెను కాపాడేందుకు వచ్చిన తల్లి మంగ(55) కూడా విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు.
జానకి భర్త నాగరాజు కర్రతో విద్యుత్ తీగను తొలగించేందుకు ప్రయత్నించగా ఆయనకూ షాక్ తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను 108 వాహనంలో నర్సీపట్నం తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షం కారణంగా కర్ర తడిసి ఉండటంతో విద్యుత్ ప్రసారం జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
బాపట్ల జిల్లా చెరువు ఉప్పరపాలెంలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలిగొందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గురువారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో ముద్రబోయిన రమాదేవి(51) తన కుమార్తె నరసమ్మ ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై తెగి వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు.
రోడ్డుపై పడిపోయిన తల్లిని రక్షించేందుకు ఆమె చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు(33) ప్రయత్నించారు. తీగను లాగి తల్లిని కాపాడేందుకు యత్నించగా ఆయనకూ విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం అర్ధరాత్రి విద్యుత్ తీగ తెగిపడి బజారులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని గ్రామస్థులు జూనియర్ లైన్మెన్ లీలా వెంకట కృష్ణారెడ్డికి ఫోన్ చేసి తెలియజేసినప్పటికీ ఆయన అక్కడికి రాలేదని స్థానికులు ఆరోపించారు. ఇద్దరు మృతిచెందిన తర్వాత గ్రామస్థులు మరోసారి ఫోన్ చేయడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో జూనియర్ లైన్మెన్ను సస్పెండ్ చేసినట్లు ఎస్ఈ ఆంజనేయులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని అధికారులు ప్రకటించారు. తల్లీకుమారుల మృతిపై ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో మరో విషాదం చోటుచేసుకుంది. దారపురెడ్డి సామ్రాజ్యం(55) గురువారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో రామాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా తెగిపడిన ఎల్టీ విద్యుత్ తీగ తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఆమె మృతిచెందారు. సామ్రాజ్యం అవివాహిత. ఆమె సోదరుల వద్ద ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.
వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెగిపడిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలు కనిపిస్తే వాటికి దూరంగా ఉండటంతో పాటు వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించాలని చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















