రాష్ట్రంలో విద్యుత్ మౌలిక వసతుల విస్తరణకు కీలకమైన సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థల నిర్మాణ పనులకు టెండర్ల సమస్య వెంటాడుతోంది. ట్రాన్స్‌కో పలుమార్లు గడువులు పొడిగిస్తున్నప్పటికీ ప్రైవేటు సంస్థల నుంచి స్పందన రావడం లేదు. దీంతో అత్యవసరంగా చేపట్టాల్సిన విద్యుత్ ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, ప్రస్తుత విద్యుత్ వ్యవస్థ సామర్థ్యం పెంపు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వంటి లక్ష్యాలతో ట్రాన్స్‌కో టెండర్లు పిలుస్తోంది. అయితే అంచనా వ్యయాలు, ప్రస్తుత మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఉందంటూ కాంట్రాక్టింగ్ సంస్థలు బిడ్లు దాఖలు చేయడం లేదని తెలుస్తోంది. కొన్ని పనులకు ఏకంగా 7 నుంచి 9 సార్లు గడువును పొడిగించినా ఒక్క బిడ్ కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టుకు నిరంతర విద్యుత్ అందించేందుకు ప్రతిపాదించిన 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కూడా టెండర్ల జాప్యంతో ఇబ్బందుల్లో పడింది. మే 20న టెండర్ ప్రకటన వెలువడగా.. జూన్ 10 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. స్పందన లేకపోవడంతో గడువును వరుసగా పొడిగించాల్సి వచ్చింది.
ఇదే పరిస్థితి డోర్నకల్‌లో ప్రతిపాదించిన 132 కేవీ సబ్‌స్టేషన్‌తోపాటు రామగుండం, ఆలేరు, నెక్కొండ ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్ పనులకూ ఎదురవుతోంది. అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు టెండర్లు ఖరారు కాకపోవడంతో ప్రాజెక్టుల అమలుపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ ప్రాజెక్టుల్లో వినియోగించే రాగి, అల్యూమినియం తదితర ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో పాత అంచనా వ్యయాలతో పనులు చేపట్టడం సాధ్యం కాదని కాంట్రాక్టర్లు వాదిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి సరుకుల ధరల మార్పులు, రవాణా వ్యయాలు, ఇతర ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ప్రస్తుత టెండర్ రేట్లు గిట్టుబాటు కావడం లేదని కంపెనీలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.
రేట్లు పెంచే వరకు టెండర్లు వేయకుండా కంపెనీలు ఒకే నిర్ణయంతో వ్యవహరిస్తున్నాయన్న అనుమానాలు అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దీనికి విద్యుత్‌శాఖలోని కొందరి ‘సహకారం’ ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు అధికారికంగా ధ్రువీకరణ లేదు.
టెండర్లు ఖరారు కాకపోతే కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం ఆలస్యం కావడంతో పాటు ట్రాన్స్‌మిషన్ సామర్థ్యం పెంపు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా, గ్రిడ్ నిర్వహణ వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు పెరిగిన వ్యయాలకు అనుగుణంగా అంచనా రేట్లను సవరించాల్సిన అవసరం ఉందా? లేదా టెండర్ ప్రక్రియలో పోటీని పెంచేందుకు ఇతర మార్గాలను అనుసరించాలా? అన్నదానిపై విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది.
ఒకే టెండర్‌కు పదే పదే గడువు పొడిగించడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదని అధికారులు గుర్తిస్తున్నారు. కంపెనీలు బిడ్‌లు దాఖలు చేయకపోవడానికి అసలు కారణాలను విశ్లేషించి, అవసరమైన చోట అంచనా వ్యయాలను సవరించడంతోపాటు టెండర్ నిబంధనలను సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే గడువులు పొడిగిస్తూ వెళ్లడం తప్ప పనులు ప్రారంభించే పరిస్థితి ఉండదని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















