కాలువల ద్వారా సాగునీటిని తరలించే సంప్రదాయ విధానానికి ప్రత్యామ్నాయంగా భూగర్భ పైపులైన్లతో పొలాలకు నీటిని అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా పెద్దగడ్డ రిజర్వాయర్ కుడి కాలువ ఆయకట్టులో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మోడరైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా అండ్ వాటర్ మేనేజ్‌మెంట్’ (ఎం-కాడ్వామ్) పథకం కింద ఈ పనులు చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాలో 1,843 హెక్టార్లు, విజయనగరం జిల్లాలో 1,218 హెక్టార్లు కలిపి మొత్తం 3,061 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటిని ఆధునిక విధానంలో అందించనున్నారు. కాలువల ద్వారా నీటిని తరలించే సమయంలో జరిగే నష్టాలను తగ్గించి, అందుబాటులో ఉన్న నీటిని పొలాలకు సమర్థంగా చేర్చడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.
రూ.64.45 కోట్లతో పనులు : పెద్దగడ్డ కుడి కాలువ పరిధిలోని 3, 4, 5, 6 నీటి వినియోగదారుల సంఘాల క్లస్టర్లలో తొలి దశ పనులు చేపట్టనున్నారు. మొదట రూ.56.10 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. పలుమార్లు టెండర్లు పిలిచిన తర్వాత ఒక ఏజెన్సీ 14.88 శాతం అధిక ధరకు బిడ్ దాఖలు చేసింది. దీంతో రూ.64.45 కోట్లతో పనులు అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
సాంకేతికతతో నీటి నిర్వహణ : ఈ ప్రాజెక్టులో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నారు. పొలాల్లోని మట్టి తేమశాతాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి, పంటకు ఎంత నీరు అవసరమో అంచనా వేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. స్కడా, ఐఓటీ పరికరాల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించి నియంత్రించనున్నారు. దీంతో అవసరానికి మించి నీటిని వినియోగించే పరిస్థితి తగ్గుతుంది.
రైతులకే నిర్వహణ బాధ్యత : పెద్దగడ్డ కుడి కాలువ పరిధిలో ఇప్పటికే నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భూగర్భ పైపులైన్ల నిర్వహణలో రైతుల భాగస్వామ్యాన్ని పెంచి, నిర్వహణ బాధ్యతలను ఆయా నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగించనున్నారు. దీంతో నీటి వినియోగంలో రైతుల బాధ్యత మరింత పెరగనుంది.
నీటి ఆదా.. రైతులకు ప్రయోజనం : ఎం-కాడ్వామ్ పథకం ప్రధాన లక్ష్యం సాగునీటిని ఆదా చేయడంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు మెరుగైన నీటి సౌకర్యం కల్పించడం. కేంద్రం ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా రూ.1,600 కోట్లను కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను సమకూర్చనున్నాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగడ్డ ప్రాజెక్టును పైలట్‌గా తీసుకుని, పనుల అమలు, నీటి ఆదా, రైతులకు కలిగే ప్రయోజనాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని ఆయకట్టు ప్రాంతాల్లో ఇలాంటి భూగర్భ పైపులైన్ ఆధారిత సాగునీటి వ్యవస్థలను విస్తరించే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















