ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా తర్వాత ఉన్నత విద్య వైపు అడుగులు వేసే విద్యార్థులకు సరైన యూనివర్సిటీని ఎంచుకోవడం ఎంతో కీలకం. మంచి పేరు, ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ ఫీజులు, త్వరగా డిగ్రీ పూర్తవుతుందనే హామీలు చూసి సంస్థను ఎంపిక చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా యూజీసీ గుర్తింపు లేని సంస్థల్లో చేరితే విద్యార్థులు చెల్లించిన ఫీజుతో పాటు విలువైన సమయాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
కొన్ని నకిలీ విద్యాసంస్థలు ప్రముఖ విశ్వవిద్యాలయాలను పోలిన పేర్లు, లోగోలు, వెబ్‌సైట్లను ఉపయోగిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. మరికొన్ని సంస్థలు అంతర్జాతీయ గుర్తింపులు, విదేశీ భాగస్వామ్యాలు, భారీ ప్లేస్‌మెంట్ అవకాశాలు ఉన్నట్లు ప్రచారం చేస్తుంటాయి. ఇలాంటి వివరాలు నిజమో కాదో అధికారిక వర్గాల ద్వారా నిర్ధరించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
గుర్తింపు లేని సంస్థ జారీ చేసిన డిగ్రీతో ఉన్నత విద్యలో ప్రవేశం, ఉద్యోగం లేదా ప్రభుత్వ నియామకాల్లో సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల కేవలం కోర్సు పేరు, ఫీజు, కాలవ్యవధి వంటి అంశాలనే కాకుండా.. ఆ సంస్థకు ఉన్న చట్టబద్ధమైన గుర్తింపు, సంబంధిత కోర్సుకు ఉన్న అనుమతులు, ఆ ఏడాదికి అమల్లో ఉన్న ఆమోదాల వివరాలను కూడా పరిశీలించాలి.
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానాల్లో కోర్సులు అందించే సంస్థలు పెరిగాయి. కొన్ని ఎడ్యుటెక్ సంస్థలు ప్రముఖ యూనివర్సిటీల పేర్లను ఉపయోగిస్తూ కోర్సులను ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు ప్రకటన చూసి నేరుగా ఫీజు చెల్లించకుండా.. సంబంధిత యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్, యూజీసీకి చెందిన సంబంధిత పోర్టళ్లలో కోర్సుకు అనుమతి ఉందో లేదో పరిశీలించాలి.
విద్యార్థులు చేరాలనుకుంటున్న యూనివర్సిటీకి వీలైతే నేరుగా వెళ్లి అక్కడి మౌలిక వసతులను పరిశీలించాలి. తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, అధ్యాపకులు, విద్యార్థుల వసతులు, పరిపాలనా విభాగం తదితర అంశాలను గమనించాలి. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో మాట్లాడితే సంస్థ పనితీరుపై మరింత స్పష్టత వస్తుంది.
‘ఇప్పుడే సీటు బుక్ చేసుకోండి’, ‘ఈరోజే ఫీజు చెల్లిస్తే భారీ రాయితీ’, ‘పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయి’ అంటూ ఒత్తిడి తెచ్చే సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముందుగా అన్ని వివరాలను పరిశీలించి, కుటుంబ సభ్యులు లేదా విద్యా నిపుణులతో చర్చించిన తర్వాతే ఫీజు చెల్లించడం మంచిది.
విద్యార్థులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా యూనివర్సిటీ ఎంపికలో భాగస్వాములు కావాలి. సంస్థ వెబ్‌సైట్‌లోని వివరాలు, గుర్తింపు, కోర్సు అనుమతులు, ఫీజు నిర్మాణం, ప్లేస్‌మెంట్ గణాంకాలు, క్యాంపస్ వివరాలను పరిశీలించాలి. అనుమానం ఉన్న అంశాలపై సంబంధిత నియంత్రణ సంస్థలను సంప్రదించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాలను నివారించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















