ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు అందించడం కాకుండా.. నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. అవకాశాలు లభించకపోవడం వల్లే బీసీలు వెనుకబడ్డారని పేర్కొంటూ.. విద్య, నైపుణ్యం, ఉపాధి, ఆంత్రప్రెన్యూర్‌షిప్, రాజకీయ ప్రాతినిధ్యం అనే ఐదు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని వెల్లడించారు.
గతంలో 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశామని గుర్తుచేసిన చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లు 24.15 శాతానికి తగ్గడంతో వేలాది మంది బీసీలు స్థానిక సంస్థల రాజకీయ పదవులు కోల్పోయారని ఆరోపించారు. ఇప్పుడు ఆ అన్యాయాన్ని సరిదిద్దే చర్యల్లో భాగంగానే 34 శాతం రిజర్వేషన్లను తిరిగి అమలు చేస్తున్నామని తెలిపారు.
పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. సుస్థిర పాలన కోసం ఒక్కో కార్పొరేషన్‌కు ఒక డిప్యూటీ మేయర్, ఒక్కో మున్సిపాలిటీకి ఒక వైస్‌ఛైర్మన్ మాత్రమే ఉండేలా మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్‌ల సంఖ్యను 28కి పెంచనున్నట్లు కూడా ప్రకటించారు.
బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని 119 బీసీ గురుకులాలను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. 993 బీసీ వసతిగృహాల్లోని సుమారు 90 వేల మంది విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. బీసీ సంక్షేమ కార్యక్రమాల కోసం గత రెండేళ్లలో రూ.32 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు తెలిపారు.
చేనేత, మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులు, గీత కార్మికులు, వడ్డెర్లు, స్వర్ణకారులు, చేతివృత్తులపై ఆధారపడిన వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పలు పథకాలు అమలు చేస్తోందని సీఎం వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా బీసీలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి.. వారిని నిర్ణయాధికారంలో భాగస్వాములను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















