మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా చిన్న కుమారుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.
గ్రామానికి చెందిన కుర్వకత్తే బీరయ్యకు మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన జంగమ్మ (35)తో దాదాపు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బీరయ్య గొర్రెల కాపరిగా పనిచేస్తూ, తనకు ఉన్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి జ్యోతి (15), శైలజ (11), జశ్వంత్ (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెలు భూత్పూర్‌లోని ఎంజేపీ బాలికల విద్యాలయంలో చదువుతుండగా, కుమారుడు ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.
ఇటీవల కుటుంబం ఇంటికి మరమ్మతులు చేయించడంతో పాటు పొలానికి నీటి సమస్యను పరిష్కరించేందుకు బోర్లు తవ్వించారు. అయితే వరుసగా రెండు బోర్లు వేయించినా నీరు రాకపోవడంతో అప్పులు మరింత పెరిగాయి. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మరో బోరు వేయించాలని బీరయ్య నిర్ణయించడంతో జంగమ్మ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు.
పిల్లలతో కలిసి పొలం వద్దకు వెళ్లిన జంగమ్మ, ఇక బోరు వేయించవద్దని భర్తను చివరిసారిగా వేడుకున్నారు. అయితే భర్త వినకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె, పిల్లలతో కలిసి సమీపంలోని పాత బావిలోకి దూకారు. బావిలో పడేటప్పుడు చిన్న కుమారుడు జశ్వంత్ ఎత్తున్న భాగంలో పడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆ వెంటనే గ్రామానికి పరుగెత్తుకుంటూ వెళ్లి జరిగిన విషయం గ్రామస్తులకు తెలియజేశాడు. స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అప్పటికే జంగమ్మ, ఆమె ఇద్దరు కుమార్తెలు జ్యోతి, శైలజలు మృతి చెందినట్లు గుర్తించారు. వారి మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు.
సమాచారం అందుకున్న భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఎస్సై చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
తల్లి, ఇద్దరు అక్కలను ఒక్కసారిగా కోల్పోయిన చిన్నారి జశ్వంత్ దిక్కుతోచని స్థితిలో ఉండటం గ్రామస్తులను కలచివేసింది. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews




















