స్నేహం పేరుతో మొదలైన పరిచయం.. సరదా పేరుతో తీసుకున్న తొలి మోతాదు.. ఆ తర్వాత అదే వ్యసనంగా మారుతోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. స్నేహితుల ప్రోద్బలంతో తొలిసారి డ్రగ్స్ రుచి చూస్తున్న వారిలో కొందరు కొద్దికాలానికే వాటికి బానిసలుగా మారుతున్నట్లు తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) అధ్యయనంలో వెల్లడైంది.
ఈగల్ బృందం గుర్తించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో సుమారు 800 మంది విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో 100 మందికిపైగా అమ్మాయిలు ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశంగా అధికారులు చెబుతున్నారు. గుర్తించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి వ్యసన విముక్తి కేంద్రాల్లో చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
బెంగళూరుకు చెందిన ఓ విద్యార్థిని ఉదంతం డ్రగ్స్ ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది. బీబీఎం చదువుతున్న ఆమె.. కళాశాలలో ఓ విద్యార్థితో ప్రేమలో పడింది. అప్పటికే మాదకద్రవ్యాలకు అలవాటు పడిన అతడు.. ఆమెకూ వాటిని పరిచయం చేశాడు. తొలుత సరదాగా ప్రారంభమైన అలవాటు కొద్దిరోజుల్లోనే వ్యసనంగా మారింది.
డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఇంట్లో డబ్బు తీసుకోవడం ప్రారంభించింది. చివరకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో బాయ్‌ఫ్రెండ్ ఇచ్చే మాదకద్రవ్యాలను ఇతరులకు సరఫరా చేయడానికి కూడా అంగీకరించింది. ఈ క్రమంలో పోలీసులకు చిక్కడంతో విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఈ ఘటనను ఉదాహరణగా చూపుతూ యువతతో పాటు తల్లిదండ్రులను అప్రమత్తం చేసేందుకు ఈగల్ బృందం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది
డ్రగ్స్‌ను తొలిసారి ఎలా ప్రయత్నించారని ఈగల్ బృందాలు సుమారు 500 మంది విద్యార్థులను ప్రశ్నించినప్పుడు.. అత్యధికంగా వినిపించిన సమాధానం ‘ఫ్రెండ్’ అని అధికారులు చెబుతున్నారు. స్నేహితుల ఒత్తిడి, సరదా, ఆసక్తి వంటి కారణాలతో తొలిసారి మాదకద్రవ్యాలను ప్రయత్నిస్తున్నట్లు విద్యార్థులు వెల్లడించారు
ముఖ్యంగా బర్త్‌డే పార్టీలు మాదకద్రవ్యాల పరిచయానికి వేదికలుగా మారుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పబ్‌లు, ఫాంహౌస్‌లు, పార్టీల్లో జరిగే వేడుకలకు ఎవరో ఒకరు డ్రగ్స్ తీసుకురావడం.. వాటిని స్నేహితుల మధ్య పంచుకోవడం.. ఒకరి వెంట మరొకరు ప్రయత్నించడం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇంటికి దూరంగా వసతిగృహాల్లో ఉండే విద్యార్థులపై తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం కూడా కొందరికి అవకాశంగా మారుతోంది. ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు హాస్టళ్లలోనూ మాదకద్రవ్యాల వినియోగం బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లో 17 మంది విద్యార్థులకు డ్రగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. మరో యూనివర్సిటీలో నలుగురు విద్యార్థులను డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిగా గుర్తించి అరెస్ట్ చేయగా.. మరో 50 మంది విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తేలింది. పలు ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ పదుల సంఖ్యలో విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లోనూ పరిస్థితి భిన్నంగా లేదని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్న అంశంపై నిఘా పెంచుతున్నారు.
మాదకద్రవ్యాల వినియోగాన్ని గుర్తించేందుకు ఈగల్ బృందాలు డ్రగ్ రాపిడ్ టెస్ట్ కిట్లను ఉపయోగిస్తున్నాయి. విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితుల మూత్ర నమూనాలను పరీక్షిస్తున్నారు. మల్టీ-స్ట్రిప్ యూరిన్ స్క్రీనింగ్ విధానంలో పనిచేసే ఈ కిట్ల ద్వారా పలు రకాల మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రాథమికంగా గుర్తించవచ్చు.
అంఫెటమైన్‌లు, ఓపియాడ్‌లు, గంజాయి, బెంజోడియాజెపైన్ తదితర సుమారు 12 రకాల మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆనవాళ్లను ఈ పరీక్షల ద్వారా గుర్తించే అవకాశం ఉంది. నమూనాను కిట్‌లో పరీక్షించిన అనంతరం సుమారు 15 నిమిషాల్లో ఫలితం అందుతుంది.
పాజిటివ్‌గా వచ్చిన వారిని తదుపరి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ రక్త నమూనాలను పరీక్షించి అవసరమైన సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అనంతరం విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు అవసరమైన వారిని వ్యసన విముక్తి కేంద్రాలకు పంపిస్తున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రం సమర్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
విద్యార్థుల్లో ఆకస్మిక ప్రవర్తనా మార్పులు, చదువుపై ఆసక్తి తగ్గడం, కొత్త స్నేహితుల విషయంలో అతిగా గోప్యత పాటించడం వంటి అంశాలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలపై అనుమానంతో నిఘా పెట్టడం కంటే.. వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల చర్యలతో పాటు కుటుంబం, విద్యాసంస్థలు, విద్యార్థుల సహకారం కూడా కీలకమని ఈగల్ బృందాలు స్పష్టం చేస్తున్నాయి..
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















