తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుర్తించింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అనుమానితుల జాబితాలో ఉన్న లోకనాథానికి సంబంధించిన నివాసాలు, బంధువుల ఇళ్లలో బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని లోకనాథం నివాసంలో బుధవారం ఉదయం 6 గంటలకే ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. లోకనాథంతో పాటు కుటుంబ సభ్యులను బయటకు వెళ్లనీయకుండా వారి సమక్షంలోనే సోదాలు చేపట్టారు. తొలిరోజు తనిఖీల్లో ప్రభుత్వ ధర ప్రకారం సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లోకనాథం ఇంట్లోని బీరువాలో సుమారు రెండు కిలోల బంగారు ఆభరణాలు, 6.50 కిలోల వెండి వస్తువులు, రూ.12.50 లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న జీ+3 భవనంతో పాటు పక్క వీధిలోని జీ+1 భవనానికి సంబంధించిన పత్రాలను కూడా పరిశీలించారు.
లోకనాథం భార్య మంజుల పేరుతో పెద్దకాపు లేఅవుట్‌లో నివాసం ఉన్నట్లు, ఆమె పేరుతో గొల్లవానిగుంటలో రెండు ఇంటి స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యంలో మరో ప్లాట్, తిరుపతి శ్రీనివాసనగర్‌లో కుమారుడి పేరుతో ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. లోకనాథం, ఆయన కుమారుడి పేర్లతో బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను కూడా సేకరించారు.
ఎస్టీవీనగర్‌లోని ఎస్‌బీఐ లాకర్‌ను కూడా ఏసీబీ అధికారులు పరిశీలించారు. అయితే లాకర్‌లో ఎలాంటి విలువైన వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.
లోకనాథం భార్య, మరో వ్యక్తి పేరుతో సంయుక్తంగా ఉన్నట్లు గుర్తించిన మరో ఆస్తి విలువ సుమారు రూ.31.98 లక్షలుగా అధికారులు అంచనా వేశారు.
లోకనాథం బావలు మునికృష్ణ, రమేష్ నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరి ఇళ్లలో కలిపి రూ.28 లక్షల నగదు, రెండు కిలోల బంగారం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
మరో బృందం ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగ గ్రామంలోని లోకనాథం తమ్ముడు వేణు ఇంట్లో సోదాలు చేపట్టింది. అక్కడ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న పది ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో తితిదే ఉద్యోగులు, డెయిరీ రంగ నిపుణులపై కేసులు నమోదయ్యాయి. మరికొందరి పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ జరపాలని ప్రభుత్వానికి సిట్ సూచించిన నేపథ్యంలో లోకనాథానికి సంబంధించిన ఆస్తులపై ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
లోకనాథం 1989 ఫిబ్రవరి 1న కారుణ్య నియామకం కింద తితిదేలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఈవో, డిప్యూటీ ఈవోగా పదోన్నతులు పొందారు. 2023 ఏప్రిల్ నుంచి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా తిరుమలలో విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు తిరుచానూరులోనూ పనిచేశారు.
బుధవారం ఏసీబీ అధికారులు తిరుమలలోని బీటైప్ క్వార్టర్స్‌లో ఉన్న లోకనాథం గదిని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ అక్కడ సోదాలు నిర్వహించలేదు.
లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించామని ఏసీబీ డీఎస్పీ మద్ది శ్రీనివాసరావు తెలిపారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
తితిదే ఉద్యోగి ఇంట్లో దాదాపు దశాబ్దం తర్వాత ఏసీబీ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2016లో అప్పటి డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి, ఆయన సోదరులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















