ప్రజలు ఆర్థికంగా బలపడటంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కక్షపూరిత రాజకీయాలపై ఆసక్తి లేదని, ప్రజలకు మంచి చేయడం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున నంద్యాలలో తనను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేశారని గుర్తుచేసుకున్న ఆయన.. ఆ సమయంలో తెలుగు జాతి మొత్తం తనకు అండగా నిలిచిందన్నారు.
తాను జైలులో ఉన్నప్పుడు పరామర్శించేందుకు వచ్చిన పవన్ కల్యాణ్‌ను కూడా అడ్డుకున్నారని, అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా తనకు మద్దతుగా నిలిచారని చంద్రబాబు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాలకులపై ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిమిషం సరిపోతుందని, అయితే తన రాజకీయ లక్ష్యం అది కాదని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలకు న్యాయం జరగాలన్నదే తన ఆలోచన అని అన్నారు.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామసభలో చంద్రబాబు పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల భూములకు భద్రత కల్పించడం, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో భూముల సరిహద్దులు మార్చడం, 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వంటి సమస్యలు ఎదురయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల్లో ఆందోళన నెలకొందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. ఇప్పటివరకు రాజముద్రతో 36 లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందించామని, వచ్చే మార్చి నాటికి మరో 56 లక్షల మందికి పంపిణీ చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 224 భూ సమస్యలను పరిష్కరించామని సీఎం తెలిపారు. కోనసీమ జిల్లాలో బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న గ్రౌండ్ రెంట్ భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపించామన్నారు. వచ్చే మార్చి నాటికి భూములకు సంబంధించి ‘జీరో ఎర్రర్’ లక్ష్యంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధిలో నీరు, భూమికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడంలో ప్రజలు ఇచ్చిన తీర్పు కీలకంగా పనిచేసిందన్నారు.
జెన్‌జీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కలెక్టర్లు కళాశాలలను సందర్శించి యువతతో నేరుగా మాట్లాడి వారి అవసరాలు, లక్ష్యాలు తెలుసుకోవాలని సూచించారు. యువతకు అనుగుణంగా విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్టీసీలో భవిష్యత్తులో అన్ని బస్సులనూ ఏసీ బస్సులుగా ప్రవేశపెడతామని చంద్రబాబు ప్రకటించారు. మహిళలకు ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని వెల్లడించడంతో సభలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
మాచవరంలోని జయంతినగర్ కాలనీలోనూ సీఎం పర్యటించారు. 22ఏ జాబితాలో ఉన్న స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి యజమానులకు శాశ్వత హక్కు కల్పించేలా పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి అరుగుపై లబ్ధిదారులతో కలిసి కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్యకు సీఎం తమ ఇంటి వద్దే పరిష్కారం చూపించారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇకపై ‘ట్రిపుల్ పీ’ విధానంతో ముందుకు సాగాలని సూచించారు. కుటుంబానికి సమయం కేటాయించడం, పార్టీ కోసం పనిచేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు.
తాను ‘పీపీపీ’ విధానాన్ని చెబుతుంటే.. లోకేశ్ కొత్తగా ‘పర్సనల్, పార్టీ, ప్రభుత్వం’ అనే ట్రిపుల్ పీ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారని చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఆకాశమే హద్దుగా ఎదిగిన టీడీపీలో 1.65 కోట్ల కుటుంబాలు భాగస్వాములుగా ఉండటం గర్వకారణమన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















