అనకాపల్లి, విశాఖ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబరు తొలి వారంలోనే ఈ రెండు ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకొస్తామని ప్రకటించారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ప్రజావేదికలో మాట్లాడారు.
అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదని.. ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమూ అభివృద్ధిలో భాగమేనని చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ ‘మన ఊరు-మన బాధ్యత’ అనే సంకల్పంతో స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనకాపల్లి ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చెప్పారు. విశాఖతో పోలిస్తే అనకాపల్లికి మరింతగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. స్టీల్ సిటీ నిర్మాణంతో పాటు డేటా సెంటర్లు కూడా రానున్నాయని తెలిపారు. భవిష్యత్తులో అనకాపల్లి నాలెడ్జ్ ఎకానమీకి కీలక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.
గూగుల్ డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనులపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్ పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే నీటి కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అనకాపల్లి జిల్లాలోని ప్రతి చెరువు, రిజర్వాయర్‌ను నింపే బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామాలను జీరో వేస్ట్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని అధికారులను, ప్రజలను కోరారు. గతంలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛరథాలను పంపుతున్నామని తెలిపారు.
ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చని చంద్రబాబు అన్నారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రజలు ప్రోత్సహించాలని సూచించారు.
2047 నాటికి ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా ఎదుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో దేశంలో తలసరి ఆదాయం రూ.50 లక్షల వరకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















