ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని తెలిపారు. గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టా, విశాఖపట్నానికి నీరు అందించాలన్నదే లక్ష్యమని చెప్పారు.మునుపటి ప్రభుత్వ కాలంలో పోలవరంలో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నప్పటికీ, తమ ప్రభుత్వం 21 నెలల్లో కొత్తగా నిర్మించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిందని వివరించారు. అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన “నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో పాల్గొని, అదే పేరుతో రూపొందించిన యాప్‌ను ప్రారంభించారు.
గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌కు తరలించాలన్నదే తన ఆలోచన అని, తద్వారా శ్రీశైలం జలాశయం నీటిని రాయలసీమకు వినియోగించవచ్చని చెప్పారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడా కరవు ఉండకుండా చేయవచ్చని పేర్కొన్నారు.ప్రతి ఏడాది గోదావరి, కృష్ణా నదుల నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, అందులో కొంత భాగాన్ని రాయలసీమకు మళ్లిస్తే అన్ని జలాశయాలు నిండుతాయని వివరించారు. ఈ ఏడాది శ్రీశైలం నుంచి అనంతపురం జిల్లాకు 74 టీఎంసీల నీటిని అందించామని తెలిపారు.
నీటి సంరక్షణపై దృష్టి సారిస్తూ, “డబ్బును బ్యాంకుల్లో దాచినట్లే నీటిని కూడా భూగర్భంలో నిల్వ చేయాలి” అని సూచించారు. అన్నమయ్య జిల్లాలో చేపట్టిన జలధార ప్రాజెక్ట్ ద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని, వేల బోర్లు, బావుల్లో నీరు తిరిగి వచ్చినట్లు చెప్పారు. విద్యుత్ వినియోగం తగ్గి కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు.రాయలసీమ అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి పెట్టారు. రాబోయే సంవత్సరాల్లో భారీ పెట్టుబడులతో ఆ ప్రాంతాన్ని ఉద్యాన హబ్‌గా మార్చే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌పై అధిక రాయితీలు అందిస్తున్నామని వివరించారు.
రాజధాని అంశంపై మాట్లాడుతూ, రాష్ట్రానికి ఒకటే రాజధాని అని, అది అమరావతి అని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.అధికారుల పనితీరుపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ, కాలువల ద్వారా చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగి, వట్టిపోయిన బోర్లలో కూడా మళ్లీ నీరు వచ్చిందని తెలిపారు. నీటి అందుబాటుతో పంటల వైవిధ్యం పెరిగి, దిగుబడులు కూడా మెరుగయ్యాయని రైతులు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















